దమ్మపేట పంచాయితీ కార్యాలయంలో చోరీ

దమ్మపేట పంచాయితీ కార్యాలయంలో చోరీ
- కీలక పత్రాలు అపహరణ
దమ్మపేట, ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేటలోని పంచాయితీ కార్యాలయంలో మంగళవారం రాత్రి దొంగతనం చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు కార్యాలయ తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించి కీలక పత్రాలను అపహరించారు.
దొంగలు ముఖ్యమైన ఫైళ్లతో పాటు 2024–2025 సంవత్సరానికి సంబంధించిన క్యాష్ బుక్, తీర్మానాల రిజిస్టర్‌ను దొంగిలించినట్లు సమాచారం. బుధవారం ఉదయం కార్యాలయానికి వచ్చిన కార్యదర్శి అనంత్ కుమార్ తాళాలు పగులగొట్టబడిన విషయాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న ఎంపీడీఓ రవీంద్ర రెడ్డి, దమ్మపేట ఎస్‌ఐ సాయి కిషోర్ రెడ్డి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం క్లూస్ టీమ్‌ను అప్రమత్తం చేయగా, వారు ఘటనాస్థలానికి చేరుకుని వేలిముద్రలు సేకరించడం, సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించడం చేపట్టారు.
కాగా, 2024–2025 మరియు 2025–2026 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన లావాదేవీలపై కొంతమంది వార్డు సభ్యులు మంగళవారం వివరాలు కోరిన నేపథ్యంలో, అదే రాత్రి కీలక పత్రాలు చోరీకి గురవడం అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉండగా, ముఖ్యమైన రిజిస్టర్లు, క్యాష్ బుక్‌లను సరిగా తాళాలు పనిచేయని బీరువాలో భద్రపరచడం నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది.
