బాచన్‌పల్లిలో రూ.30 లక్షల సొసైటీ గోడౌన్‌కు భూమిపూజ
- పనులను ప్రారంభిస్తున్న టీజీఎండీసీ చైర్మన్ అనిల్
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ మండలం బాచన్‌పల్లి గ్రామంలో రైతుల సౌకర్యార్థం రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న సొసైటీ గోడౌన్‌కు శుక్రవారం ఘనంగా భూమిపూజ నిర్వహించారు. రాష్ట్ర టీజీఎండీసీ చైర్మన్ అనిల్ ఈరవత్రి ముఖ్య అతిథిగా హాజరై గోడౌన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల పంటలకు తగిన నిల్వ సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. నూతన గోడౌన్ నిర్మాణం పూర్తయితే రైతులు తమ పంటలను భద్రంగా నిల్వ చేసుకునే అవకాశం కలుగుతుందని, దీంతో పంట నష్టాలు తగ్గడంతో పాటు రైతులకు ఆర్థికంగా మేలు జరుగుతుందని పేర్కొన్నారు. బాచన్‌పల్లి గ్రామంతో పాటు పరిసర గ్రామాల రైతులకు కూడా ఈ గోడౌన్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ధాన్యం, విత్తనాలు, ఎరువుల నిల్వకు ఈ గోడౌన్ కీలకంగా మారుతుందని, గ్రామీణ వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడించారు. గోడౌన్ నిర్మాణం త్వరగా పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానిక రైతులు ఈ సందర్భంగా కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ జనార్దన్, మున్సిపల్ చైర్‌పర్సన్ బోదిరే నాగమణి స్వామి, వైస్ చైర్మన్ జేజే నర్సయ్య, మొదటి వార్డు కౌన్సిలర్ ఆరెపల్లి నాగేంద్ర బాబు,నాయకులు కన్నె సురేందర్, మెండోరా సర్పంచ్ కుంట రమేష్, మాజీ ఎంపీటీసీ అరిగెల స్వామి, నాయకులు కోరాడి రాజు, నరేందర్, మీసాల శ్రీనివాస్, బెజ్జోరా, భాస్కర్, సొసైటీ సభ్యులు, రైతులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
