ఏరువాక పౌర్ణమి సంప్రదాయాన్ని పునరుద్ధరించాలి.. రైతులకు బీజేపీ కిసాన్ మోర్చా పిలుపు

రైతు సంస్కృతికి ప్రతీకగా నిలిచిన ఏరువాక పండుగను ప్రతి గ్రామంలో ఘనంగా నిర్వహించాలని చింతా శరత్ కుమార్ రెడ్డి సూచన

శ్రీ సత్యసాయి, ఆంధ్రప్రభ: జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి సందర్భంగా జరుపుకునే “ఏరువాక పౌర్ణమి” రైతు సంస్కృతికి, వ్యవసాయ సంప్రదాయాలకు ప్రతీక అని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చింతా శరత్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కనుమరుగవుతున్న ఈ గొప్ప సంప్రదాయాన్ని తిరిగి పునరుద్ధరించేందుకు ప్రతి గ్రామం ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ఏరువాక పౌర్ణమి రాజకీయాలకు అతీతంగా రైతులు జరుపుకునే పవిత్రమైన పండుగ అని తెలిపారు. అన్నం పెట్టే భూమి తల్లికి కృతజ్ఞతలు తెలిపే రోజుగా, నాగలి, ఎద్దులు వంటి వ్యవసాయానికి ఆధారమైన సాధనాలను గౌరవించే గొప్ప సంప్రదాయాన్ని మన పూర్వీకులు ఏర్పరచారని వివరించారు.

ఏరువాక పౌర్ణమి రోజున పొలాన్ని దున్నడం ద్వారా వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండుతాయని పెద్దలు విశ్వసించేవారని గుర్తు చేశారు. ఆధునిక కాలంలో ట్రాక్టర్లు, యంత్ర పరికరాలు వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, సంప్రదాయానికి గుర్తుగా కనీసం ఒక గీత అయినా ఎద్దులతో దున్ని రైతు సంస్కృతిని భావితరాలకు అందించాలని సూచించారు.

ఈ పండుగ సందర్భంగా ఎద్దులకు పసుపు, కుంకుమ పెట్టి పూలదండలతో అలంకరించడం, నాగలికి ప్రత్యేక పూజలు నిర్వహించడం, పొలంలో ఐదు గీతలు దున్నడం, భూమి తల్లికి అక్షతలు సమర్పించడం, ఎద్దులకు బెల్లం పెట్టి గౌరవించడం వంటి సంప్రదాయాలను ప్రతి రైతు కుటుంబం పాటించాలని కోరారు. ఇటువంటి ఆచారాలు రైతుకు భూమితో ఉన్న అనుబంధాన్ని మరింత బలపరుస్తాయని అన్నారు.

గతంలో రైతు కుటుంబాల్లో ఏరువాక పౌర్ణమి ఒక పెద్ద పండుగగా జరుపుకునేవారని చింతా శరత్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. రైతు వద్ద పనిచేసే నౌకరు ఒక రైతు నుంచి మరొక రైతు వద్దకు మారే సమయంలో కొత్త బట్టలు ధరింపజేసి, ప్రత్యేక విందులతో సత్కరించే గొప్ప సంప్రదాయం ఉండేదని చెప్పారు. గ్రామీణ సమాజంలో పరస్పర గౌరవం, సహకారం, సాంప్రదాయ విలువలకు ఈ పండుగ నిదర్శనంగా నిలిచేదని వివరించారు.

వ్యవసాయం కేవలం జీవనోపాధి మాత్రమే కాకుండా భారతీయ సంస్కృతికి మూలస్తంభమని పేర్కొన్న ఆయన, రైతు సంప్రదాయాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. యువత కూడా ఈ సంప్రదాయాల ప్రాముఖ్యతను తెలుసుకొని గ్రామాల్లో ఏరువాక పండుగను సామూహికంగా నిర్వహించేలా ముందుకు రావాలని సూచించారు.

ఏరువాక మరచిన రైతు.. భవిష్యత్తు మరచినట్టే” అనే సందేశంతో ఈ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా ప్రతి గ్రామంలో ఏరువాక పండుగను ఘనంగా నిర్వహించి, రైతు సంస్కృతిని పరిరక్షించాలని చింతా శరత్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. రైతు వారసత్వాన్ని, భూమి పట్ల కృతజ్ఞత భావాన్ని భావితరాలకు అందించడమే ఈ సంప్రదాయం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.