Errabelli | బీసీలను మోసం చేసింది కాంగ్రెస్…

Errabelli | బీసీలను మోసం చేసింది కాంగ్రెస్…
- మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
- కష్టకాలంలో పక్కన నిలిచిన వారే నిజమైన వారు
కొడకండ్ల, ఆంధ్రప్రభ : కొడకండ్ల మండలంలోని గ్రామ ఇన్‌చార్జీలు, గ్రామ నాయకులతో బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ, బీసీ వర్గాలను నిజంగా మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఎర్రబెల్లి మాట్లాడుతూ… కష్ట సమయంలో మనవెంట నిలిచేవారే మన వారు. ప్రస్తుతం జరుగుతున్న సర్వేలు అన్నీ బీఆర్ఎస్ పార్టీ దిశగా ఉన్నాయన్నారు. ఈ ప్రభుత్వం ఒకే వ్యక్తి చేతిలో నాశనమైపోతోందని, రాష్ట్రంలో యూరియా కొరత కూడా ఈ అసమర్థ పాలన కారణంగానే ఏర్పడిందని పేర్కొన్నారు.
కేసీఆర్ హయాంలో రైతులు ‘రైతు రాజు’గా గౌరవంగా జీవించారని, అయితే కాంగ్రెస్ పాలనలో రైతులు మళ్లీ ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ఎర్రబెల్లి ధీమా వ్యక్తం చేశారు.
ప్రతి కార్యకర్తను కలుపుకుంటూ పార్టీ గెలుపు కోసం ఒక్కొక్కరూ కృషి చేయాలి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మా నాయకుడు కేసీఅర్‌నే సీఎం అవుతారు. గడపగడపకు వెళ్లి ఈ ప్రభుత్వ బోగస్ హామీలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి అని పిలుపునిచ్చారు.
బతుకమ్మ చీరలను బంధు పెడుతూ ‘ఇందిరమ్మ చీరలు’ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేస్తున్నట్లు ఎర్రబెల్లి ఆరోపించారు. మహిళల పేరిట లోన్లు తీసుకుని, ఆ చీరలు కూడా వారికే పరిమితం చేస్తున్నారని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఇన్‌చార్జ్ బబ్బూరి శ్రీకాంత్ గౌడ్, మండల అధ్యక్షుడు సింధే రామోజీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పేరం రాము, ఇతర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
