గ్రామీణ కూలీలకు ఉపాధి

ఏనుగల్లు తండా చెరువులో జోరుగా పూడికతీత పనులు
నర్సంపేట రూరల్, మే 23 (ఆంధ్రప్రభ): గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్) గ్రామాల్లో ఆశాకిరణంగా మారుతోంది. నర్సంపేట మండల పరిధిలోని ఏనుగల్లు తండా చెరువులో ప్రస్తుతం ఉపాధి హామీ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. చెరువు పూడికతీత, మట్టి తరలింపు, కాలువల శుభ్రపరిచే పనుల్లో మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.

ఉదయం నుంచే కూలీలు పనులకు హాజరై శ్రమిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఉపాధి హామీ పనుల ద్వారా గ్రామీణ కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగుతోందని కూలీలు పేర్కొన్నారు. చెరువుల అభివృద్ధితో పాటు భూగర్భ జలాల పెరుగుదలకు కూడా ఈ పనులు దోహద పడుతున్నాయని స్థానికులు తెలిపారు. ఈ సందర్భంగా ఏనుగల్లుతండా సర్పంచ్ బోడ మౌనిక మాట్లాడుతూ వేసవి కాలంలో ఉపాధి అవకాశాలు తగ్గిన సమయంలో ప్రభుత్వం చేపడుతున్న ఈ పనులు గ్రామీణ ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా మారాయని వారు అభిప్రాయపడ్డారు.
