పేదల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట..
ఏలూరులో ఎమ్మెల్యే బడేటి చంటి ఉచిత వైద్య శిబిరం పరిశీలన
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలే లక్ష్యం..
ముఖ్యమంత్రి చంద్రబాబు స్ఫూర్తితో ఉచిత వైద్య శిబిరాలు : ఎమ్మెల్యే బడేటి చంటి
ఏలూరు, ఆంధ్రప్రభ : పేదల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడంతో పాటు వారి ఆరోగ్య సంరక్షణకు కూడా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. సేవా కార్యక్రమాల ద్వారానే పేదల సంపూర్ణ ఆరోగ్య వికాసం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఏలూరు పవర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రతి గురువారం నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరం గురువారం కూడా విజయవంతంగా జరిగింది. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఈ శిబిరంలో ఉచిత వైద్య సేవలు పొందారు.
శిబిరానికి వచ్చిన వారికి వైద్యులు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి శిబిరాన్ని స్వయంగా పరిశీలించి, ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు.
శిబిరానికి వచ్చిన బాధితులతో ఆప్యాయంగా మాట్లాడిన ఎమ్మెల్యే వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, అవసరమైన వారికి స్వయంగా మందులు అందించి భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారికి సహాయకారిగా నిలవాలనే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాలను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతి వారం ఈ శిబిరాలను నిరంతరంగా నిర్వహించడంతో పాటు అవసరాన్ని బట్టి మెగా వైద్య శిబిరాలు నిర్వహించి, ఖరీదైన స్పెషలిస్టు వైద్య సేవలను కూడా పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, టీడీపీ నగర అధ్యక్షుడు చోడే వెంకటరత్నం, ప్రధాన కార్యదర్శి రెడ్డి నాగరాజు, పలువురు కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్చార్జీలు, డివిజన్ ఇన్చార్జీలు పాల్గొన్నారు.
