ఎడతెరిపి లేని వర్షాలతో పెద్దపల్లి జిల్లా అతలాకుతలం
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: మంగళవారం తెల్లవారుజాము నుంచి బుధవారం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల రహదారులపై వరద నీరు ప్రవహించగా, కొన్ని ప్రాంతాల్లో రోడ్లు కోతకు గురయ్యాయి. లోతట్టు కాలనీలు నీట మునగడంతో ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితిని మున్సిపల్, రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సహాయక చర్యలు చేపట్టారు.
జిల్లాలో సాధారణంగా 6.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా, ఏకంగా 84 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. కమాన్పూర్ మండలంలో అత్యధికంగా 141.4 మిల్లీమీటర్లు, రామగుండంలో 129.3 మిల్లీమీటర్లు, పాలకుర్తిలో 117.4 మిల్లీమీటర్లు, రామగిరిలో 108 మిల్లీమీటర్లు, అంతర్గాంలో 101.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ధర్మారం, పెద్దపల్లి, మంథని మండలాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. మరోవైపు జూలపల్లి, ఎలిగేడు, సుల్తానాబాద్ మండలాల్లో సీజన్ వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదైంది.
భారీ వర్షాలతో రైతులకు ఊరట లభించినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో పొలాల్లో నీరు నిల్వ ఉండటంతో వ్యవసాయ పనులకు అంతరాయం ఏర్పడింది. జిల్లా మొత్తం సీజన్ వర్షపాతం 402.6 మిల్లీమీటర్లు నమోదవగా, సాధారణంతో పోలిస్తే 6 శాతం మాత్రమే లోటు ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న ఒకటి రెండు రోజుల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అవసరం లేకుంటే బయటకు రావద్దని, వాగులు, చెరువులు, కల్వర్టుల వద్ద అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
