ఘ‌నంగా ఆసిరితల్లి సిరిమానోత్సవ సంబరాలు

ఘ‌నంగా ఆసిరితల్లి సిరిమానోత్సవ సంబరాలు

సిరిమానును ప్రారంభించిన ఎమ్మెల్యే గొండు శంకర్..
భక్తజన సంద్రంగా మారిన ఆధ్యాత్మిక క్షేత్రం..

శ్రీకాకుళం, ఆంధ్ర‌ప్ర‌భ : ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లిలో ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ఆసిరితల్లి సిరిమానోత్సవ సంబరాలు అంబరాన్ని తాకాయి. అత్యంత భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించిన ఈ వేడుకలకు భక్తులు భారీగా తరలివచ్చారు. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ ఈ ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచి, కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అమ్మవారి దర్శనం – ప్రత్యేక పూజలు:

సిరిమానోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ ముందుగా ఆసిరితల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి కృపాకటాక్షాలు జిల్లా ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఇల్లూ పాడిపంటలతో వర్ధిల్లాలని ఆయన ప్రార్థించారు. అనంతరం, వేద మంత్రోచ్ఛారణల మధ్య కొబ్బరికాయ కొట్టి, మంగళవాయిద్యాల మోతతో సిరిమాను సంబరాలను అధికారికంగా ప్రారంభించారు.

సిరిమానోత్సవాల నేపథ్యంలో అరసవల్లి ప్రాంతం మొత్తం విద్యుత్ కాంతులతో, రంగురంగుల తోరణాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. వీధులన్నీ భక్తుల జయజయధ్వానాలతో మార్మోగాయి. గిరిజన నృత్యాలు, కోలాటాలు, తప్పెటగుళ్ల ప్రదర్శనలు సంబరాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శ్రీకాకుళం జిల్లా నలుమూలల నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా భక్తులు వేల సంఖ్యలో తరలిరావడంతో అరసవల్లి భక్తజన సంద్రంగా మారింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎమ్మెల్యే గొండు శంకర్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

తాగునీరు, క్యూలైన్లు, ప్రసాద వితరణలో లోటుపాట్లు లేకుండా అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు ఆసిరితల్లి సిరిమానోత్సవంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నానని,. మన సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు . ఈ ఉత్సవాలు జిల్లా ప్రజల మధ్య ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందిస్తాయన్నారు. సిరిమాను ఊరేగింపు భక్తులకు కనువిందు చేసింది.

Leave a Reply