El Nino | మరో 15 రోజుల్లో వానలు లేకపోతే కరువు ముప్పు

El Nino | మరో 15 రోజుల్లో వానలు లేకపోతే కరువు ముప్పు

El Nino | 20 లక్షల ఎకరాలకే పరిమితమైన ఖరీఫ్ సాగు

వరి, పత్తి సాగుపై ఎల్నినో తీవ్ర ప్రభావం

14 జిల్లాల్లో చినుకు లేదు.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన

ఆరుతడి పంటల వైపు రైతుల మొగ్గు

El Nino | హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది ఖరీఫ్ సాగు తిరోగమన దిశగా వెళుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరో 15 రోజుల్లోగా వానలు కురవకపోతే రాష్ట్రంలో కరువు మేఘాలు కమ్ముకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే వచ్చిన కొద్దిపాటి చినుకులకు విత్తనాలు వేసిన జిల్లాల్లో మరో రెండు, మూడు జల్లులు కురిస్తే వేసిన పత్తి విత్తనాలు మొలుస్తాయని, వరి నారుమళ్లు ప్రాణం పోసుకుంటాయని రైతులు ఆశిస్తున్నారు.

15 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఖరీఫ్‌లో ఇప్పటి వరకు అతి తక్కువ విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. ఏటా వానాకాలంలో కోటి 30 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతుండగా, ఎల్నినో దెబ్బకు, వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ సీజన్‌లో ఇప్పటి వరకు కేవలం 20 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు జరిగిందని వ్యవసాయశాఖ నివేదిక స్పష్టం చేసింది.

ప్రధానంగా 62 లక్షల ఎకరాల్లో సాగయ్యే వరి 1,10,126 ఎకరాల్లో మాత్రమే సాగైంది. పత్తి సాధారణంగా 48 లక్షల ఎకరాల్లో సాగవుతుండగా, ఈసారి 26 లక్షల ఎకరాల్లో మాత్రమే విత్తనాలు నాటారు. జొన్న 50,730 ఎకరాల్లో సాగవ్వాల్సి ఉండగా కేవలం 8,429 ఎకరాల్లో మాత్రమే సాగవుతోంది. మొక్కజొన్న 5,21,206 ఎకరాల లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 1,02,676 ఎకరాల్లో మాత్రమే రైతులు పంట వేశారు. కంది 6,69,732 ఎకరాలకు గాను జులై 1 నాటికి 1,43,242 ఎకరాల్లో మాత్రమే సాగైంది.

గత వానాకాలం సీజన్‌లో జూన్ చివరి నాటికి 39.41 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. ఈసారి ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో గత ఏడాదితో పోలిస్తే సుమారు 19 లక్షల ఎకరాల మేర సాగు తగ్గింది. సోయాబీన్ 4.20 లక్షల ఎకరాల లక్ష్యానికి గాను 1,64,709 ఎకరాల్లో, పెసర్లు 85,779 ఎకరాలకు 20,680 ఎకరాల్లో, మినుములు 32,903 ఎకరాలకు 5,789 ఎకరాల్లో మాత్రమే సాగయ్యాయి.

అత్యంత ఆందోళనకర విషయం ఏమిటంటే.. ఇప్పటివరకు 14 జిల్లాల్లో చినుకు కూడా పడలేదు. 18 జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. నల్లగొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో మాత్రమే విత్తనాలు వేసేంత వర్షపాతం నమోదైంది.

వర్షాభావ పరిస్థితులు కొనసాగుతుండటంతో రైతులు వరి, పత్తి సాగుకు బదులుగా ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. సరిపడా వానలు లేకపోవడంతో కూరగాయలు, పండ్లు, నువ్వులు, పొద్దుతిరుగుడు, కుసుమ, శనగ వంటి పంటలను సాగు చేస్తున్నారు. వీటితో అధిక ఆదాయం వస్తోందని ఉద్యానశాఖ ప్రచారం చేస్తోంది. ఈ ఏడాది నుంచి మార్కెట్ సౌకర్యాలను కూడా మెరుగుపరుస్తున్నట్లు తెలిపింది.

ఇప్పటివరకు రైతులు కూరగాయలు, పండ్లు మార్కెట్‌కు తీసుకొస్తే ధరలు పడిపోవడం, దళారులు మాత్రం రెట్టింపు ధరలకు విక్రయించడం ఆనవాయితీగా మారింది. ఈసారి అలాంటి పరిస్థితులు రాకుండా ఉద్యానశాఖ చర్యలు చేపడుతోంది.

వర్షాభావం, ఎరువులు, విత్తనాల ధరల పెరుగుదల, సాగు వ్యయాలు అధికం కావడంతో కౌలు రైతులు ఖరీఫ్ సాగుకు దూరమవుతున్నారు. అప్పులతో సేద్యం చేయడం కంటే, పట్టణాలకు వలస వెళ్లడమే మంచిదనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.