సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేసాం…

సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేసాం…

ఓట్లు తొలగించకుండా జాగ్రత్తపడండి…

పుట్టపర్తి, ఆంధ్రప్రభ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను విజయవంతంగా అమలు చేసి ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నామని పుట్టపర్తి ఎమ్మెల్యేపల్లె సింధూరరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై నియోజకవర్గ క్లస్టర్ ఇంచార్జిలు, కో క్లస్టర్ ఇంచార్జిలు, యూనిట్ ఇంచార్జిలు, కోయూనిట్ ఇంచార్జిలు, నిర్వహించిన వర్క్‌షాప్ లో మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృత ప్రచారం నిర్వహించాలని పార్టీ నాయకులకు సూచించారు.

ప్రతి ఒక్క ఓటు కీలకమని, ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ముఖ్యంగా టీడీపీ మద్దతుదారుల ఓట్లు తొలగించబడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం సుపరిపాలన దిశగా వేగంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. 2029 ఎన్నికల్లో మరోసారి కూటమిని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటేనే ఆంధ్రప్రదేశ్‌లో ఊహించని స్థాయిలో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

నియోజకవర్గంలో 1.51 లక్షల కోట్ల పెట్టుబడులతో భారీ పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. కూటమి పాలనలో కేవలం రెండేళ్ల వ్యవధిలోనే నియోజకవర్గం కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చెందిందన్నారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందన్నారు. కార్యక్రమానికి ముందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply