బ్రహ్మోత్సవాల నాటికి ఈ-బస్సులు

బ్రహ్మోత్సవాల నాటికి ఈ-బస్సులు

టీటీడీ అదనపు ఈవో కీలక ఆదేశాలు

తిరుమ‌ల‌కు రిలయన్స్ విరాళంగా అందిస్తున్న 25 ఎలక్ట్రిక్ బస్సులపై సమీక్ష సమావేశం
ఛార్జింగ్ స్టేషన్లు, విద్యుత్ సరఫరా, డ్రైవర్ల నిర్వహణపై కార్యాచరణకు రూపకల్పన
ఒకేసారి 20 బస్సులకు ఛార్జింగ్ సదుపాయం కల్పించేలా మౌలిక వసతుల ఏర్పాటుకు సూచనలు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తిరుమలలో భక్తులకు మరింత పర్యావరణహిత, ఆధునిక రవాణా సేవలు అందించేందుకు టీటీడీ చర్యలను వేగవంతం చేసింది. రిలయన్స్ సంస్థ విరాళంగా అందిస్తున్న 25 ఎలక్ట్రిక్ బస్సులను రానున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు.

తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో రిలయన్స్ సంస్థ ప్రతినిధులతో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి సమీక్ష సమావేశం నిర్వహించారు. రిలయన్స్ సంస్థ టీటీడీకి విరాళంగా అందిస్తున్న 25 ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, విద్యుత్ సరఫరా, డ్రైవర్ల నియామకం, నిర్వహణ తదితర అంశాలపై ఈ సమావేశంలో సవివరంగా చర్చించారు.

ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ, భక్తులకు సౌకర్యవంతమైన, కాలుష్య రహిత రవాణా సేవలు అందించడమే లక్ష్యంగా ఎలక్ట్రిక్ బస్సులను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని తెలిపారు. రానున్న బ్రహ్మోత్సవాల నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి బస్సులను సేవల్లోకి దించాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ప్రస్తుతం టీటీడీ నిర్వహిస్తున్న 15 ఎలక్ట్రిక్ బస్సులతో పాటు రిలయన్స్ అందించనున్న మరో 25 బస్సులు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మొత్తం 50 బస్సుల సామర్థ్యానికి అనుగుణంగా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని సూచించారు. ఒకేసారి 20 బస్సులకు ఛార్జింగ్ అందేలా 10 ఛార్జింగ్ పాయింట్లతో కూడిన ఆధునిక ఛార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని రిలయన్స్ బృందాన్ని కోరారు.

అదేవిధంగా నిరంతర విద్యుత్ సరఫరా, బస్సుల నిర్వహణకు అవసరమైన సాంకేతిక వ్యవస్థ, శిక్షణ పొందిన డ్రైవర్ల అందుబాటు, నిర్వహణ సిబ్బంది నియామకం వంటి అంశాలపై ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

పర్యావరణ పరిరక్షణతో పాటు భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన రవాణా సేవలు అందించాలన్న టీటీడీ లక్ష్యానికి అనుగుణంగా ఈ ఎలక్ట్రిక్ బస్సుల ప్రాజెక్టు కీలక ముందడుగుగా నిలవనుందని అధికారులు అభిప్రాయపడ్డారు. బ్రహ్మోత్సవాల నాటికి ఈ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే తిరుమలలో ప్రజారవాణా వ్యవస్థ మరింత ఆధునికంగా మారనుంది.