Alcohol | మందుబాబుల ఆగడాలు..

Alcohol | మందుబాబుల ఆగడాలు..
పంట కాల్వల్లో మద్యం సీసాలు
మందుబాబులకు అడ్డాగా పంట పొలాలు
వైన్ షాప్ పరిసర ప్రాంతాల్లోనే అధికం
Alcohol | శావల్యాపురం, ఆంధ్రప్రభ : వ్యవసాయం చేయాలంటే భయం.. పొలంలోకి దిగాలన్నా భయమే.. రైతన్నల (Farmers) పాలిట శాపంగా మారుతున్నాయి మందుబాబుల ఆగడాలు. వారిని పట్టించుకునే నాథుడే లేక వారి ఆగడాలను ఆపే వారు లేక ఇలా తయారైంది అన్నదాతల దుస్థితి. ఇదేంటని అని ప్రశ్నించిన వాడికి మద్యం మత్తు ఏం చేస్తుందో తెలియదు. అవసరమైతే తగాదాలు లేకపోతే కేసులు. వివరాల్లోకి వెళితే ఇలా ఉన్నాయి. మద్యం ప్రియులు మందు తాగాలంటే ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. ఖాళీగా ఉన్న పంటపొలాలు, రోడ్ల వెంబడి చెట్లు ఉంటే చాలు మందుబాబులకు అడ్డాగా దర్శనమిస్తున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా రోడ్ల వెంబడి మందుబాబుల వీరంగాలు ఎక్కువై పోతున్నాయి. రాత్రి వేళల్లో మహిళలలను బండి ఎక్కించుకుని నడపాలంటే భయపడుతూ వెళ్లాల్సిందే.

మందు బాబులు మద్యం సేవించి ఖాళీ సీసాలను పగలగొట్టి పంటపొల్లాల్లో, కాలువల్లో, రోడ్లపై పారేస్తున్నారు. వైన్ షాప్ పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా దర్శనమిస్తున్నాయి. దీంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. పంట కాలువలు (Crop canals) బాగుచేసే సమయాలలో, పంటకు నీరు వేసుకొనే సమయంలో మరియు కూలీలు వరి నాటే సమయాలలో, కలుపు తీద్దామన్న గాజు పెంకులు కాళ్లకు గుచ్చుకొని రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. వరి నాట్లు వేసే సమయంలో కూలీలు పొలాల్లోకి దిగాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. పోలీసుల గస్తీ కూడా లేకపోవడంతో ఇష్ట రాజ్యాంగా తయారవుతున్నారు. రోడ్ల వెంబడి, పొలాల్లో మద్యం సేవించే వారిపై కనీస చర్యలు తీసుకుంటే నైనా ఈ ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చని రైతులు, గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

