banana plantation | జిల్లా అరటి రైతులను ఆదుకోవాలి
ఏపీ కౌలు రైతు సంఘం
banana plantation | అనంతపురం జిల్లా (రాప్తాడు), ఆంధ్రప్రభ : జిల్లా వ్యాప్తంగా అరటి పంటలు పెట్టిన రైతులకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో పంటలు అమ్ముకోలేక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బాల రంగయ్య పేర్కొన్నారు. శనివారం రాప్తాడు మండల పరిధిలోని పరసన్నాయపల్లి గొందిరెడ్డిపల్లి బుక్కచెర్ల గ్రామాలలోని అరటి పంటలు పెట్టిన రైతులతో సమావేశం నిర్వహించారు. అనంతరం అరటి తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అరటి పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు పంటను అమ్ముకోలేక పంట పెట్టుబడికి చేసినప్పుడు ఎలా తీర్చాలో తెలియక విలవిలలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అందువలన జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని అరటి పంటకు ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. రోజుల క్రితం గొందిరెడ్డిపల్లి గ్రామంలో రైతు సీనయ్య 3 ఎకరాలలో సాగుచేసి చేతికొచ్చిన అరటి పంటను యంత్రాలతో దున్నివేశారు. అలాగే పరసన్నాయిపల్లిలో రైతు నాగిరెడ్డి ఆరు ఎకరాలలో అరటి పంట ప్రస్తుతం కోత దశలో ఉంది. ఎకరాకు దాదాపు రెండు లక్షలు దాకా పెట్టుబడి పెట్టామన్నారు. పంటను వ్యాపారస్తులు ప్రభుత్వము కొనుగోలు చేసే పరిస్థితి లేకపోవడంతో పంటకు మందులు నీళ్లు వదలకుండా అలాగే వదిలేశారు. ఇంకా కొంతమంది రైతులు మార్కెట్లో ధరలు పెరుగుతాయని ఆశతో అరటికాయలు మాగకుండా (పాకం రాకుండా) ఉండేందుకు మందులు వాడుతూ పంటను అలాగే తోటలో పెట్టుకున్నారు.
అరటి రైతులకు నష్టం జరుగుతున్నా స్థానిక నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ అసలు పట్టించుకోవడం లేదు. నిజంగా ప్రభుత్వం అనేది ఉంటే సాంకేతిక పరిజ్ఞానం గురించి చెప్పే ప్రభుత్వం సచివాలయాలు అందుబాటులో ఉండి జిల్లాలో అరటి పంట ఎంత సాగయింది?దిగుబడి ఎంత వస్తుంది? మార్కెట్ గిట్టుబాటు ధర పరిస్థితి ఏమిటి? ముందస్తు అంచనా అంటే ఈరోజు అరటి రైతులు పంటను యంత్రాలతో దున్నేయడం పంటను బజారులో పారేయడం జరిగేది కాదు. అందువలన ఇప్పటికైనా ప్రభుత్వ హస్టళ్ళకు ఆసుపత్రులకు ప్రభుత్వమే అరటిని సరఫరా చేయాలి. గిట్టుబాటు ధర కనీసం కేజీ రూ.10 కల్పించాలి. అప్పుడు కొంత వరకైనా ఆదుకోవచ్చు అన్నారు. అందువలన వెంటనే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అరటి రైతులకు భరోసా ధైర్యాన్ని ఇచ్చి మార్కెట్ సౌకర్యం కల్పించి మనోవేదనకు అప్పులకు గురికాకుండా రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రజా సంఘాలుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయన్నారు. లేనిపక్షంలో ప్రజా సంఘాలు ఏకతాటిపై అరటి రైతులకు మద్దతు ఇచ్చి గిట్టుబాటు ధరల కోసం ఉద్యమాన్ని చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పోతులయ్య సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రామాంజనేయులు రైతులు విష్ణువర్ధన్ రెడ్డి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
