బీసీ వసతి గృహాల దుస్థితి..

విద్యార్థుల భవితకు ముప్పు

మూడు హాస్టళ్లకు ఒకే వార్డెన్.. అద్దె భవనాల్లో అవస్థలు

గిద్దలూరు, ఆంధ్రప్రభ : పేద విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేయాల్సిన బీసీ వసతి గృహాలు సమస్యల వలయంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు తమ పిల్లల చదువుల కోసం ప్రభుత్వ వసతి గృహాలను ఆశ్రయిస్తుంటే, అక్కడ నెలకొన్న సమస్యలు విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన కలిగిస్తున్నాయి.

గిద్దలూరు వెనుకబడిన తరగతుల సహాయ సంక్షేమ అధికారి కార్యాలయం పరిధిలో మొత్తం 15 బీసీ వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో కేవలం మూడు వసతి గృహాలకు మాత్రమే ప్రభుత్వ భవనాలు ఉండగా, మిగిలిన 12 వసతి గృహాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి.

అద్దె గృహాల్లో నిర్వహిస్తున్న వసతి గృహాల్లో సరైన మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇరుకైన గదులు, సరైన గాలి-వెలుతురు లేకపోవడం, తగినన్ని మరుగుదొడ్లు లేకపోవడం, చదువుకునేందుకు అనుకూల వాతావరణం లేకపోవడం విద్యార్థుల దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. గిద్దలూరు మండలంలోని సంజీవరాయునిపేట, గిద్దలూరు బాలుర, కళాశాల వసతి గృహాలు, కొమరోలు బాలుర, బాలికల వసతి గృహాలు, బేస్తవారిపేట, గలిజేరగుళ్ల, కంభం, అర్ధవీడు ప్రాంతాల వసతి గృహాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి.

గత ఏడాది 15 వసతి గృహాల్లో 13 హాస్టళ్లకు ఆర్‌ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసినప్పటికీ, కొన్ని చోట్ల అవి పనిచేయడం లేదని సమాచారం. దీంతో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందడం లేదు. సంజీవరాయునిపేట, అనుమలవీడు వసతి గృహాలకు ఇప్పటివరకు ఆర్‌ఓ ప్లాంట్లు కూడా మంజూరు కాలేదు. వసతి గృహాల్లో రెగ్యులర్ వార్డెన్ల కొరత తీవ్రంగా ఉంది. ఒకే వార్డెన్‌కు రెండు లేదా మూడు హాస్టళ్ల బాధ్యతలు అప్పగించడంతో పర్యవేక్షణ కష్టంగా మారింది.

గిద్దలూరు బాలికల వసతి గృహం వార్డెన్ పార్వతీబాయికి మరో రెండు హాస్టళ్ల బాధ్యతలు అప్పగించగా, ఎడవల్లి హాస్టల్ వార్డెన్ కొండయ్యకు గిద్దలూరు, కొమరోలు బాలుర వసతి గృహాల బాధ్యతలు ఇచ్చారు. అలాగే మరికొందరు వార్డెన్లు కూడా బహుళ హాస్టళ్లను పర్యవేక్షిస్తున్నారు.

దీంతో విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, క్రమశిక్షణ, ఆరోగ్యం, చదువులపై పర్యవేక్షణ చేయడం కష్టసాధ్యమవుతోందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గిద్దలూరు వెనుకబడిన తరగతుల సహాయ సంక్షేమ అధికారి హరిప్రసాద్ పదవీ విరమణ చేయడంతో ఆ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో కంభం బీసీ బాలికల వసతి గృహ వార్డెన్ సోమ్లీబాయికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆమె ప్రస్తుతం ఇన్‌చార్జి ఏఎస్‌డబ్ల్యూఓగా విధులు నిర్వహిస్తున్నారు. వసతి గృహాలకు సొంత భవనాలు లేకపోవడం, మౌలిక వసతుల కొరత, వార్డెన్ల కొరత, ఖాళీ పోస్టులతో విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగుతోందని తల్లిదండ్రులు, విద్యావేత్తలు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలని, రెగ్యులర్ సంక్షేమ అధికారులు, వార్డెన్లను నియమించాలని, విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని వారు కోరుతున్నారు.