ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాలు పంపిణీ

ములకలపల్లి, ఆంధ్రప్రభ : రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని సామాజిక సేవా కార్యక్రమాలలో ముందుండే టి.ఎన్.ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోపాలు పంపిణీ చేయడం జరిగింది. ట్రస్ట్ చైర్మన్ తాండ్ర వేంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం సామరస్యానికి, సోదరభావానికి ప్రతీకగా నిలిచింది.
రంజాన్ మాసం అనేది ముస్లిం సమాజానికి అత్యంత పవిత్రమైన కాలంగా భావిస్తారు. ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, దానధర్మాలు చేస్తూ ఆధ్యాత్మిక భావనతో ఈ మాసాన్ని గడుపుతారు. ఈ నేపథ్యంలో ముస్లిం సోదరులకు సహాయంగా ఉండాలనే ఉద్దేశంతో టి.ఎన్.ఆర్ ట్రస్ట్ తరఫున రంజాన్ తోపాలను అందజేయడం జరిగింది. ఈ తోపాలలో పండుగ సందర్భంగా అవసరమైన ఆహార పదార్థాలు, దినసరి అవసరాల సామగ్రి ఉండటం వల్ల పేద కుటుంబాలకు ఉపశమనం కలిగింది.

ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ తాండ్ర వేంకటేశ్వరరావు మాట్లాడుతూ, సమాజంలో మత భేదాలు లేకుండా అందరూ పరస్పరం సహకరించుకుంటూ జీవించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. రాబోయే 21వ తేదీన జరగబోయే రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఆనందంగా, ఐక్యతతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. సమాజంలో స్నేహభావం పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఇలాంటి కార్యక్రమాలు సామాజిక ఐక్యతకు దోహదపడతాయని అన్నారు.
అలాగే.. ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ.. ముస్లిం సోదరులతో కలిసి పండుగ ఆనందాన్ని పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు నారాటి ప్రసాద్, తాండ్ర బుచ్చిబాబు, ఇనుగంటి రాము, కోదుమూరి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ తోపాలను అందజేసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమం స్థానికంగా మంచి స్పందనను పొందింది. ముస్లిం సోదరులు ట్రస్ట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను మరింత బలపరుస్తాయని అభిప్రాయపడ్డారు. రంజాన్ మాసం సందర్బంగా నిర్వహించిన ఈ కార్యక్రమం మత సామరస్యానికి నిదర్శనంగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు.
