సర్కారు బడిలో విద్యార్థులకు పౌష్టికాహారం, పుస్తకాల పంపిణీ

కరీమాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, విద్యా ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా చేపట్టిన ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ కార్యక్రమం నేడు సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా, 35వ డివిజన్ , శివనగర్ లోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అల్పాహార పథకంతో పాటు ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు పుస్తకాలు ,నోటుబుక్స్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిపిసిసికార్యదర్శి కొత్తపెల్లి శ్రీనివాస్,35వ డివిజన్ మాజీ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ కుమార్,కాంగ్రెస్ పార్టీ 35వ డివిజన్ అధ్యక్షుడు రేణుకుంట్ల శివకుమార్, కాంగ్రెస్ నాయకులు శ్రీరామ్ రాజేష్ పాల్గొన్నారు.​

ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షుడు రేణుకుంట్ల శివకుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు ఆకలితో ఇబ్బంది పడకుండా, చదువుపై పూర్తి ఏకాగ్రత చూపేలా చూడటమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని అన్నారు. పౌష్టికాహారం అందించడం ద్వారా పిల్లల శారీరక, మానసిక వికాసానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఈ పథకం ఎంతో మేలు చేస్తుందని, బడిలో విద్యార్థుల హాజరు శాతం కూడా పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
​ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, నరేంద్ర స్వామి, ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, డివిజన్ కార్యకర్తలు పాల్గొన్నారు.