హై స్కూల్‌లో టెక్స్ట్‌బుక్స్, నోట్‌బుక్స్ పంపిణీ..

హై స్కూల్‌లో టెక్స్ట్‌బుక్స్, నోట్‌బుక్స్ పంపిణీ..

మ‌ణికొండ‌, ఆంధ్ర‌ప్ర‌భ : ఆంవేసవి సెలవులు ముగియడంతో సోమ‌వారం పాఠశాలలు పునఃప్రారంభమైన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టెక్స్ట్‌బుక్స్, నోట్‌బుక్స్ పంపిణీ కార్యక్రమం మణికొండ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఘనంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మణికొండ మున్సిపాలిటీ మాజీ ఫ్లోర్ లీడర్ రామకృష్ణ రెడ్డి విద్యార్థులకు టెక్స్ట్‌బుక్స్, నోట్‌బుక్స్‌ను పంపిణీ చేశారు. పాఠశాలలు ప్రారంభమైన తొలి రోజునే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించడం ప్రభుత్వ నిబద్ధతను చాటుతున్నదని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువస్తూ, విద్యార్థుల భవిష్యత్తు అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. మొదటి రోజునే పుస్తకాల పంపిణీ జరగడం విద్యా వ్యవస్థలో ఒక మంచి ప్రారంభానికి సంకేతమని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, నార్సింగ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ బుద్ధోలు శ్రీరాములు, డైరెక్టర్ ఏర్పుల కుమార్, నాయకులు శివగంగ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.