వారం రోజుల్లో ఇంటి పట్టా..

దివ్యాంగ బాలికకు అండగా జిల్లా యంత్రాంగం

అర్జీపై వెంటనే స్పందించిన కలెక్టర్..

మానవత్వానికి నిదర్శనంగా చర్యలు

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను వేగంగా పరిష్కరిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా యంత్రాంగం మరోసారి ప్రజలకు భరోసా కల్పించింది. ఓ దివ్యాంగ బాలిక కుటుంబ పరిస్థితిని గుర్తించి, అర్జీ ఇచ్చిన కేవలం వారం రోజుల్లోనే ఇంటి పట్టా మంజూరు చేసి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మానవత్వాన్ని చాటుకున్నారు.

కొత్తచెరువు మండలం కొత్తచెరువు గ్రామానికి చెందిన వి. సాయి లీల, బి. మంజునాథ్ దంపతుల కుమార్తె వి. శిరీష (10) పూర్తిగా అంగవైకల్యంతో బాధపడుతోంది. తమ కుమార్తెకు అంగవైకల్య పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ బాలిక తల్లిదండ్రులు ఈ నెల 15న పుట్టపర్తి కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

అర్జీ స్వీకరించిన సందర్భంగా కుటుంబ పరిస్థితులను తెలుసుకున్న కలెక్టర్, వారికి సొంత ఇంటి స్థలం కూడా లేదని గుర్తించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి, కుటుంబ ఆర్థిక ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని కేవలం పింఛన్ సమస్య పరిష్కారానికే పరిమితం కాకుండా ఇంటి పట్టా మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి అవసరమైన ప్రక్రియలను వేగంగా పూర్తి చేశారు. ఫలితంగా అర్జీ ఇచ్చిన వారం రోజుల్లోనే ఇంటి పట్టా మంజూరైంది.

సోమవారం పుట్టపర్తి కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా వి. శిరీష తల్లిదండ్రులకు ఇంటి పట్టాను అందజేశారు.

తమ సమస్యను మానవతా దృక్పథంతో పరిశీలించి, తక్షణమే స్పందించి ఇంటి పట్టా అందజేసిన జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌తో పాటు జిల్లా యంత్రాంగానికి బాలిక తల్లిదండ్రులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కేవలం ఫిర్యాదుల స్వీకరణకే కాకుండా అర్హులైన వారికి సకాలంలో న్యాయం అందించే వేదికగా మారుతోందని ఈ ఘటన మరోసారి నిరూపించింది.