స్వీయ గణన విధానం ఎలా పని చేస్తుంది?

స్వీయ గణన విధానం ఎలా పని చేస్తుంది?

  • దేశంలో ఎక్కడి నుంచైనా స్వీయ గణనకు అవకాశం
  • ఆన్‌లైన్ ద్వారా నేటి నుంచి స్వీయ గణన
  • పారదర్శకంగా లెక్కలు తేలుస్తాం
  • డేటా ప్రైవసీపై ఆందోళన అవసరం లేదు
  • కోర్ అర్బన్ అంతా ఒకే యూనిట్‌గా జనగణన – సెన్సస్ డైరెక్టర్ భారతి హోళికేరి

హైదరాబాద్, ఆంధ్రప్రభ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనగణన డేటా ఆధారంగానే ప్రజలకు అవసరమైన విధానాలు, ప్రణాళికలు రూపొందిస్తాయని సెన్సస్ డైరెక్టర్ భారతి హోళికేరి తెలిపారు. దేశంలో 16 ఏళ్ల తర్వాత నిర్వహించనున్న ఈ జనగణనను డిజిటల్ విధానంలో నిర్వహించడం వల్ల ఇది చరిత్రలోనే మైలురాయిగా నిలుస్తుందని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం జరుగుతున్న తొలి జనగణన ఇదేనని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ఆర్వీ కర్ణన్‌తో కలిసి ఆమె జనగణన వివరాలను వెల్లడించారు. సమావేశంలో జనగణనకు సంబంధించిన ప్రత్యేకంగా రూపొందించిన టేబుల్ క్యాలెండర్, టీ కప్‌ను ఆవిష్కరించారు.

మొత్తం మూడు విడతలుగా జరగనున్న జనగణన ప్రక్రియలో భాగంగా ఆదివారం నుంచి స్వీయ గణన (Self Enumeration) ప్రారంభమై మే 10 వరకు కొనసాగుతుందని తెలిపారు. దేశంలో 1931 తర్వాత కుల గణన జరుగుతుండగా, 16 సంవత్సరాల అనంతరం జనగణన నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గతంలో పేపర్‌ ఆధారంగా చేపట్టిన గణనను ఇప్పుడు డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెల్ఫ్ ఎన్యుమరేషన్, ఇండ్ల గణన, జనాభా గణన వంటి దశలు ఉంటాయని వివరించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు సర్వర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు.

జనగణనను అద్దంలా పారదర్శకంగా నిర్వహిస్తామని, సమాచారం గోప్యత విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడి నుంచైనా సెల్ఫ్ ఎన్యుమరేషన్ భారతదేశంలో ఎక్కడ ఉన్నా సెల్ఫ్ ఎన్యుమరేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్ర గణనలో నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందని భారతి హోళికేరి తెలిపారు. “se.census.gov.in” వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కుటుంబ వివరాలను నమోదు చేసుకోవచ్చని సూచించారు. సుమారు 15 నిమిషాల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు.

సాధారణంగా జనగణన సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి వివరాలు సేకరించే విధానానికి బదులుగా, సాంకేతికతను వినియోగించి ప్రజలే తమ వివరాలను నేరుగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించినట్టు చెప్పారు. ఈ ప్రక్రియ తప్పనిసరి కాదని, కేవలం ఒక ఎంపిక మాత్రమేనని స్పష్టం చేశారు. ముందుగా కుటుంబ యాజమాని పేరు, మొబైల్ నంబర్ నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక 11 అంకెల ఐడీ నంబర్ లభిస్తుందని చెప్పారు. జనగణనలో మొత్తం 33 ప్రశ్నలు ఉండగా, సెల్ఫ్ ఎన్యుమరేషన్‌లో 27 ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు.

మిగిలిన 6 ప్రశ్నలకు సంబంధించిన వివరాలను రెండో దశలో ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు అందించాలని సూచించారు. సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసిన వారు తర్వాత ఎన్యుమరేటర్ వచ్చినప్పుడు రిఫరెన్స్ నంబర్ చూపిస్తే సరిపోతుందని తెలిపారు. ఒక కుటుంబం సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసినా, చేయకపోయినా రెండో దశలో ఎన్యుమరేటర్ ప్రతి ఇంటికీ తప్పనిసరిగా వస్తారని చెప్పారు. ఈ క్రమంలో ఇండ్ల గణన సమయంలో ప్రతి ఇంటికి ప్రత్యేక నంబర్ కేటాయిస్తామని తెలిపారు.

ఒకే యూనిట్‌గా కోర్ అర్బన్ – ఆర్వీ కర్ణన్
జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ పరిధిలో 2027 సెన్సస్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో జీహెచ్‌ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపాలిటీల పరిధిలోని 300 వార్డులను ఒకే యూనిట్‌గా పరిగణిస్తున్నట్టు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లో జరిగే జనగణనకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారని చెప్పారు. ఈ పరిధిలో మొత్తం 19,865 హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ రూపొందించి, అన్ని ప్రాంతాల్లో డిజిటల్ మ్యాపింగ్ పూర్తి చేసినట్టు తెలిపారు. సెన్సస్ నిర్వహణకు 21,866 ఎన్యుమరేటర్లు, 3,662 సూపర్వైజర్లు అవసరమవుతారని చెప్పారు. దీనిపై విస్తృత ప్రచారం నిర్వహిస్తూ, వాట్సాప్ సందేశాలు, పబ్లిక్ ప్రచారం, మెట్రో, బస్సులు, హోర్డింగ్స్, పాఠశాలల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తామని వివరించారు.

Leave a Reply