ఇంద్రకీలాద్రిపై భక్తులకు మెరుగైన వసతులు

ఇంద్రకీలాద్రిపై భక్తులకు మెరుగైన వసతులు
చివరి దశలో వెయిటింగ్ హాల్ పనులు..
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి…ఈవో శీనా నాయక్
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి శీనా నాయక్ గురువారంమహామండపం ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించి పనుల పురోగతిని సమీక్షించారు. ముఖ్యంగా లిఫ్ట్ ఏరియాలో భక్తులు వేచి ఉండేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న వెయిటింగ్ హాల్ పనులను తనిఖీ చేశారు.
ఈ హాల్‌కు సంబంధించిన ఫ్లోరింగ్ పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. భక్తులు రద్దీ సమయంలో విశ్రాంతి తీసుకునేలా ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. అనంతరం ఇంజినీరింగ్ అధికారులతో కలిసి మహామండపంలోని అన్ని అంతస్తులను పరిశీలించిన ఈవో, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. మరుగుదొడ్ల నిర్వహణ, పరిశుభ్రత ప్రమాణాలపై ఎక్కడా రాజీ పడవద్దని సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు ఆధునిక సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా దేవస్థానం చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.


