జిన్నారంలో భూ హక్కుల కోసం దీక్ష..

గుమ్మడిదల జిన్నారం, ఆంధ్రప్రభ : అమెరికాలో స్థిరపడిన ఓ రైతు తన స్వగ్రామ భూమి హక్కుల కోసం స్వదేశానికి పరుగెత్తుకొచ్చి, ఐదు నెలలుగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ఘటన జిన్నారంలో చర్చనీయాంశంగా మారింది. న్యాయం జరగకపోవడంతో చివరకు తహశీల్దార్ కార్యాలయం ఎదుటే రైతు దీక్షకు దిగారు. మండల పరిధిలోని శివనగర్ గ్రామానికి చెందిన రైతు రవి శంకర్‌కు సర్వే నంబర్ 172లో 14 గుంటల పట్టా భూమి ఉంది. అయితే ఆ భూమిని సంబంధం లేని వ్యక్తి పేరుపై రెవెన్యూ అధికారులు మార్చారని ఆయన ఆరోపిస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న రవి శంకర్ అమెరికా నుంచి హుటాహుటిన స్వగ్రామానికి చేరుకుని, గత ఐదు నెలలుగా తన భూమి హక్కుల కోసం అధికారులను కలిసి వినతిపత్రాలు అందజేస్తున్నారు. అయితే పలుమార్లు ఆధారాలు చూపించినప్పటికీ అధికారులు స్పందించడం లేదని రవి శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జిన్నారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆయన ధర్నాకు దిగారు.
“నా భూమిని తిరిగి నా పేరుపై నమోదు చేసే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు” అంటూ స్పష్టం చేశారు. మరోవైపు జూన్ మొదటి వారంతో తన అమెరికా గ్రీన్ కార్డు గడువు ముగియనుందని, తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ న్యాయం కోసం ఇక్కడే ఉండాల్సి వస్తోందని కన్నీటి పర్యంతమయ్యారు. రైతు చేస్తున్న దీక్షకు స్థానికులు, రైతు సంఘాల నాయకులు మద్దతు తెలుపుతున్నారు. రెవెన్యూ శాఖ నిర్లక్ష్యంపై మండిపడుతూ, వెంటనే విచారణ జరిపి బాధిత రైతుకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
