ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమానికి కృషి

ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమానికి కృషి

  • మున్సిపల్ చైర్‌పర్సన్ కూన వనిత

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని సంగారెడ్డి మున్సిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్ కూన వ‌నిత సంతోష్ పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఉమ్మ‌డి మెద‌క్ జిల్లా ప్ర‌థ‌మ మ‌హా స‌భ‌ను సంగారెడ్డి మండ‌లం కుల‌బ్‌గూర్ గ్రామంలో నిర్వహించారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్య‌క్షుడు బీద్ర‌య్య అధ్య‌క్ష‌త‌న‌ జరిగిన ఈ కార్య‌క్ర‌మానికి సంగారెడ్డి మున్సిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్ కూన వ‌నిత సంతోష్, ఆర్టీసీ సంగారెడ్డి డిపో మేనేజ‌ర్ పి.ఉపేంద‌ర్ ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా విశ్రాంత ఉద్యోగులు తమ స‌మ‌స్య‌ల‌తో కూడిన విన‌తి ప‌త్రాన్ని కూన వ‌నిత‌కు అంద‌జేశారు. కార్యాలయం ఏర్పాటు కోసం సుమారు 200 గ‌జాల స్థ‌లం కేటాయించాల‌ని కోరారు. దీనిపై కూన వ‌నిత‌ స్పందిస్తూ.. టీజీఐఐసీ చైర్‌ప‌ర్స‌న్ నిర్మ‌ల‌జ‌గ్గారెడ్డి దృష్టికి ఈ స‌మ‌స్య‌ల‌న్నీ తీసుకెళ్లి పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తామ‌ని హామీ ఇచ్చారు. సభలో ఆర్టీసీ డిపో మేనేజ‌ర్ పి.ఉపేంద‌ర్ మాట్లాడుతూ.. విశ్రాంత కార్మికులంతా ఐక్యంగా ఉండి త‌మ హ‌క్కుల కోసం పాటుపడాలని సూచించారు.

ఇచ్చిన హామీలు అమలు చేయాలి: రాఘ‌వ‌రెడ్డి
ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు గతంలో ఇచ్చిన పలు హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోకపోవడం బాధాకరమని ఆర్.రాఘవ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అసోసియేషన్ కార్యాలయాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. పీఎఫ్ రిటైర్మెంట్ పొందిన వారికి సూపర్ లగ్జరీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పీఎఫ్ రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం కల్పించడంతో పాటు, ఆఫీస్ డ్యూటీలో ఉన్న ఉద్యోగులకు ప్రత్యేక రెస్ట్ రూమ్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయకపోతే ఉద్యోగుల తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్య‌క్ర‌మంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.రాజయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బుచ్చిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు బి.మురళీధర్, ఎండీ ఫారూఖ్, ఎస్.కే.మూర్తి పాల్గొన్నారు. అలాగే మెదక్ రీజియన్ అధ్యక్షుడు పి.పీరయ్య, మెదక్ రీజియన్ చైర్మన్ పీఎస్ నారాయణ, మెదక్ రీజియన్ ప్రధాన కార్యదర్శి బిట్ల కృష్ణమూర్తితో పాటు ఉమ్మడి జిల్లా నలుమూలల నుండి భారీగా విశ్రాంత ఉద్యోగులు హాజ‌ర‌య్యారు.

v

Leave a Reply