జాతీయ రహదారిపై ఘోరరోడ్డు ప్రమాదం..
- కారు ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే మృతి!
ఆంధ్రప్రభ : బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామం సమీపంలో జాతీయ రహదారి-216పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చందోలు గ్రామానికి చెందిన నంబూరి నాంచరయ్య (35) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు బసవయ్య కుమారుడిగా పోలీసులు గుర్తించారు. రహదారి దాటుతున్న లేదా వెళ్తున్న సమయంలో వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదానికి కారణమైన కారు (నమోదు నంబర్: TS 07 EB 6446) ను చీరాలకు చెందిన అట్లా బాలకృష్ణ రెడ్డి నడుపుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఆయన స్వగ్రామం కర్లపాలెం అని పోలీసులు వెల్లడించారు. కారు అతివేగంగా ఢీకొట్టడంతో నాంచరయ్య తీవ్ర గాయాలపాలై ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే చందోలు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాపట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. చందోలు ఎస్సై మాధవరావు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు ఏఎస్ఐ రామయ్య అధికారికంగా మీడియాకు వెల్లడించారు.
