రైతులకు కరువు నివారణ చర్యలపై అవగాహన

ముప్పాళ్ళ, ఆంధ్రప్రభ: మండలంలోని మాదల గ్రామంలో శుక్రవారం ఎలినినో- ప్రభావం నివారణ కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎస్. శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. 2026 ఖరీఫ్ సీజన్‌లో నెలకొన్న ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ రాష్ట్రవ్యాప్తంగా “రైతన్న మీకోసం – ఎల్‌నినో ప్రభావ నివారణ కార్యాచరణ ప్రణాళిక” పేరుతో సమగ్ర క్షేత్రస్థాయి ప్రత్యేక ప్రసార కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించిందని తెలిపారు.

ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు ప్రతి రైతు సేవా కేంద్రం పరిధిలోని ప్రతి రైతును, ప్రతి వ్యవసాయ భూకమతాన్ని 100 శాతం సందర్శించి క్షేత్రస్థాయిలో పంటల పరిస్థితిని అంచనా వేయాలని అధికారులు తెలిపారు. పంటల ప్రస్తుత పరిస్థితి, నీటి కొరత కారణంగా పంటలు ఎండిపోవడం లేదా వాడిపోవడం, చీడపీడల ఉధృతి, ఉద్యాన పంటల పరిస్థితి, బీడు లేదా సాగు చేయని భూముల వివరాలను సేకరించి తగిన చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

క్షేత్రస్థాయిలో గుర్తించిన కరువు పరిస్థితులకు అనుగుణంగా రైతులు తీసుకోవాల్సిన నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని పంట మార్పిడి, అంతరపంటలు, తక్కువ నీటి అవసరం ఉన్న పంటల సాగు వైపు రైతులు మొగ్గు చూపాలని సూచించారు. అలాగే ఫామ్ పాండ్లు, చెక్‌డ్యాముల ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసి భూగర్భ జలాల పెరుగుదలకు కృషి చేయాలని తెలిపారు.

నోటిఫై చేసిన పంటలకు దిగుబడి ఆధారిత పంటల బీమా పథకంలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, మట్టి పరీక్షల ఆధారంగా మాత్రమే ఎరువులు వినియోగించాలని సూచించారు. డ్రిప్, స్ప్రింక్లర్, మల్చింగ్ వంటి నీటి పొదుపు పద్ధతులను విస్తృతంగా వినియోగించుకోవడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు వివరించారు.

ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగు రైతు సంఘం అధ్యక్షుడు రావిపాటి నానయ్య, ముప్పాళ వ్యవసాయ విస్తరణ అధికారి ఎన్. శేషుబాబు, వి.ఏ.ఏ. నీలిమా, గ్రామ రైతులు పాల్గొన్నారు.