నిశ్శబ్దంగా సాగుతున్న సేవ.. దాహార్తికి చల్లని చేయూత
దండేపల్లి, ఆంధ్రప్రభ: గత వారం రోజులుగా మండుతున్న ఎండల్లో ప్రయాణికుల దాహం తీర్చాలనే సంకల్పంతో ఓ దంపతులు చేస్తున్న సేవ స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది. దండేపల్లి మండలం మెదరిపేటలో సత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో సత్యసాయి భక్తులు గుండా ప్రభాకర్, రమాదేవి దంపతులు గత 20 రోజులుగా తమ సొంత ఖర్చులతో ఉచితంగా అంబలి పంపిణీ చేస్తున్నారు.
ప్రతిరోజూ రోడ్డుపై ప్రయాణించే వారికి, పేదలకు జొన్న పిండితో తయారు చేసిన అంబలిని అందిస్తున్నారు. రోజుకు సుమారు 10 నుంచి 20 కిలోల వరకు అంబలి తయారు చేసి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతిరోజూ సమాజానికి ఏదో ఒక విధంగా సేవ చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే పని చేయడం ద్వారా ఆత్మసంతృప్తి లభిస్తోందన్నారు.
సత్యసాయి బోధనల స్ఫూర్తితో ప్రతి రోజు ఉదయం భజనలు, నగర సంకీర్తనలు, నామస్మరణలు నిర్వహిస్తున్నామని తెలిపారు. భగవంతుని స్మరణతో ఆయురారోగ్యాలు కలుగుతాయని విశ్వసిస్తున్నామని పేర్కొన్నారు.
ఎండల తీవ్రతలో ప్రజల దాహం తీర్చాలనే ఉద్దేశంతో ఉచిత అంబలి పంపిణీ చేపట్టామని, ప్రతి ఒక్కరిపై సత్యసాయి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామని దంపతులు తెలిపారు.
