సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ
సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ
పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య
కమ్మర్ పల్లి, మే 20 ( ఆంధ్ర ప్రభ ): “మన ఊరు – మన భద్రత, మన బాధ్యత” కార్యక్రమంలో భాగంగా కమ్మర్‌పల్లి మండలంలోని ఉప్లూర్ గ్రామం లోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు.. కమ్మర్ పల్లి ఎస్ఐ జి. అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు,వాటి ప్రయోజనాలపై బుధవారం ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు.ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ జి. మధుకర్ గ్రామస్తులకు సీసీటీవీ కెమెరాల ప్రాముఖ్యతను వివరించారు.
సీసీటీవీ వ్యవస్థలు 24 గంటల నిఘా ద్వారా సంఘ వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తాయని,అలాగే నేరాల నియంత్రణ మరియు దర్యాప్తులో పోలీసులకు ఎంతో సహాయపడతాయని తెలిపారు.ఈ కార్యక్రమం ద్వారా “కమ్యూనిటీ పోలీసింగ్” వ్యవస్థను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.గ్రామ ప్రజలు తమ ఇళ్లలో,వ్యాపార సంస్థల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో భద్రతపై అవగాహన పెంపొందించి కమ్యూనిటీ పోలీసింగ్ ను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. అవగాహన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్, ఉపసర్పంచ్ తక్కురి శేఖర్, గ్రామ పాలకవర్గం సభ్యులు,ప్రజలు, మహిళలు,యువకులు తదితరులు పాల్గొన్నారు.
