పచ్చని కర్నూలు లక్ష్యంగా 45 లక్షల మొక్కల పెంపు…

పచ్చని కర్నూలు లక్ష్యంగా 45 లక్షల మొక్కల పెంపు…

జిల్లాలో పచ్చదనం పెంపుకు సమగ్ర కార్యాచరణ.
ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలి : కలెక్టర్ డా. ఏ. సిరి

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాను పచ్చని కర్నూలుగా తీర్చిదిద్దేందుకు ఈ ఏడాది 45 లక్షల మొక్కలను నాటేలా కార్యాచరణ రూపొందించినట్లు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి భవిష్యత్ తరాలకు పర్యావరణాన్ని బహుమతిగా అందించాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ గ్రామంలోని కాల్వబుగ్గ నర్సరీని సందర్శించిన కలెక్టర్ అక్కడ జరుగుతున్న మొక్కల పెంపకాన్ని పరిశీలించారు.

అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం పచ్చదనం 36 శాతం ఉండాల్సి ఉండగా కేవలం 6 శాతం మాత్రమే ఉందన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో భారీ స్థాయిలో మొక్కల నాటకాన్ని చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. పచ్చదనం పెంపు కోసం అన్ని శాఖలను సమన్వయం చేస్తూ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. డ్వామా ఆధ్వర్యంలో 10 లక్షల మొక్కలు, అటవీ శాఖ ఆధ్వర్యంలో మరో 10 లక్షల మొక్కలు పెంచుతున్నామని, మిగిలిన 25 లక్షల మొక్కలను వివిధ శాఖలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో నాటనున్నట్లు తెలిపారు.

ఇప్పటికే మూడు ప్రధాన నర్సరీలలో భారీ స్థాయిలో మొక్కల పెంపకం జరుగుతోందన్నారు. కాల్వబుగ్గ నర్సరీలో 3 లక్షల మొక్కలు, ఆలూరు ప్రాంతంలో 3.5 లక్షల మొక్కలు, బనవాసి ప్రాంతంలో 3 లక్షలకు పైగా మొక్కల పెంపకం కొనసాగుతోందని వివరించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో కూడా 10 లక్షలకు పైగా మొక్కలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. సీతాఫలం, టేకు, నేరేడు, ఉసిరి, చింత, కానుగ, వేప వంటి పర్యావరణానికి ఉపయోగకరమైన మొక్కలను పెంచుతున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.

జిల్లాలో ఖాళీ ప్రదేశాలను గుర్తించి మొక్కల నాటకానికి అనువుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ముఖ్యంగా పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామాలు, కాలనీలు, రహదారుల పరిసర ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో మొక్కల నాటకం చేపట్టనున్నట్లు తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు మొక్కలు అందజేసి ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను పెంచేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. మున్సిపల్ పరిధిలో ప్రతి దుకాణానికి ఒక మొక్క అందజేసి వాటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు.

పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, నేషనల్ హైవే రోడ్ల వెంట కూడా పెద్ద ఎత్తున మొక్కల నాటకం చేపట్టనున్నట్లు వెల్లడించారు. జిల్లాలో 45 లక్షల మొక్కలను నాటి వాటిని సమర్థవంతంగా సంరక్షిస్తే కనీసం ఒక శాతం పచ్చదనం పెరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు.

రానున్న జూన్ నెలలో వర్షాలు ప్రారంభమయ్యే అవకాశముండటంతో అదే సరైన సమయంగా భావించి విస్తృత స్థాయిలో మొక్కల నాటకం చేపట్టాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఇంచార్జి కర్నూలు ఆర్డీఓ అనురాధ, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ నరసింహరెడ్డి, ఏపిడీ పద్మ, ఓర్వకల్లు తహశీల్దార్ విద్యాసాగర్, ప్లాంటేషన్ మేనేజర్ నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply