ఆధారాలు లేకుండా ఆరోపణలు సరికాదు..

  • నిరుద్యోగుల్లో గందరగోళం సృష్టించొద్దు
  • అవకతవకలపై ఆధారాలుంటే కోర్టును ఆశ్రయించాలి: మంత్రి టీజీ భరత్‌

కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ : మెగా డీఎస్సీ నియామకాలపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తూ రాజకీయాలు చేయడం సరికాదని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు. సోమవారం కర్నూలులోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

డీఎస్సీ నియామకాలకు సంబంధించి వైఎస్సార్‌సీపీ నేతలు లేవనెత్తిన అంశాలపై అధికారులు ఇప్పటికే ఆధారాలతో వివరణ ఇచ్చారని మంత్రి తెలిపారు. నియామకాల్లో నిజంగా అవకతవకలు జరిగాయని భావిస్తే అందుకు సంబంధించిన ఆధారాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సూచించారు. నిరాధార ఆరోపణలతో నిరుద్యోగుల్లో అనవసర గందరగోళం సృష్టించడం తగదన్నారు.

మెగా డీఎస్సీ నియామక ప్రక్రియను ప్రభుత్వం నిబంధనల ప్రకారమే నిర్వహించిందని టీజీ భరత్‌ తెలిపారు. డీఎస్సీ ద్వారా వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభించాయని పేర్కొన్నారు. స్పోర్ట్స్‌ కోటా తదితర అంశాలపై వైఎస్సార్‌సీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు సంబంధిత అధికారులు ఇప్పటికే పూర్తి వివరాలతో సమాధానం ఇచ్చారని చెప్పారు. అయినప్పటికీ అదే అంశాలను పదేపదే ప్రస్తావించడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని విమర్శించారు.

డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న వారు ఆధారాలను ప్రజల ముందు ఉంచాలని మంత్రి అన్నారు. ఆధారాలు ఉంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని, ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల్లో అనవసర ఆందోళన కలిగించేలా రాజకీయ ప్రకటనలు చేయడం సరికాదన్నారు. అధికారులు ఇచ్చిన వివరణలను పరిగణనలోకి తీసుకుని వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు.

ఇంతియాజ్‌ హత్యపై మంత్రి ఆగ్రహం

టీడీపీ కార్యకర్త ఇంతియాజ్‌ అహ్మద్‌ హత్యపై మంత్రి టీజీ భరత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతియాజ్‌, ఆయన సోదరుడు మహబూబ్‌ ఖాన్‌కు వారం రోజుల ముందే బెదిరింపులు ఉన్నట్లు సమాచారం ఉన్నప్పటికీ హత్య జరగడం ఆందోళనకరమన్నారు. ఈ ఘటనలో ఇంటెలిజెన్స్‌, పోలీసు వ్యవస్థ ఎక్కడ విఫలమైందో సమీక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

హంద్రీ ప్రాంతంలో అక్రమ భవనాలపై ఫిర్యాదు చేసినందుకే ఇంతియాజ్‌ను లక్ష్యంగా చేసుకుని హత్య చేసినట్లు మంత్రి ఆరోపించారు. ఇంతియాజ్‌ రౌడీ లేదా ఫ్యాక్షనిస్ట్‌ కాదని, అక్రమాలపై ఫిర్యాదు చేసిన వ్యక్తి మాత్రమేనని పేర్కొన్నారు. హత్య కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు తెలిసిందని, మిగిలిన నిందితులను కూడా త్వరగా అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానని టీజీ భరత్‌ తెలిపారు. కర్నూలులో రౌడీయిజం, ఫ్యాక్షనిజాన్ని పూర్తిగా అణచివేయాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో చంద్రబాబు పాలనలో రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని కట్టడి చేసిన విధంగానే ప్రస్తుతం కూడా పోలీసు యంత్రాంగం కఠినంగా వ్యవహరించాలని సూచించారు. పోలీసు, ఇంటెలిజెన్స్‌ విభాగాలు మరింత అప్రమత్తంగా వ్యవహరించి రౌడీ మూకలను కట్టడి చేయాలని మంత్రి కోరారు.