ఎరువుల ధరలు వెంటనే తగ్గించాలి

రైతాంగాన్ని ముంచుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలు..

సీపీఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్

బెజ్జంకి, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం విపరీతంగా పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించి, రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని సీపీఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బెజ్జంకి మండల కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల వల్ల దేశంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు ఎరువుల ధరలు పెంచుతూ రైతులపై భారాలు మోపుతున్న ప్రభుత్వం, మరోవైపు రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు.

అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం వల్ల 32 దేశాల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు సున్నా సుంకంతో భారత మార్కెట్‌లోకి దిగుమతి అవుతున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల దేశీయంగా పత్తి, మొక్కజొన్న పండించే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.

దేశంలో ప్రతి ఏటా రూ.18 లక్షల కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్‌కు వస్తున్నప్పటికీ, కనీస మద్దతు ధరలు అమలు కాకపోవడం వల్ల రైతాంగం అప్పులపాలవుతోందని విమర్శించారు.

స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పంట సాగు వ్యయానికి 50 శాతం అదనంగా కలిపి మద్దతు ధర నిర్ణయిస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి లెక్కించడం వల్ల రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదని మండిపడ్డారు.

చట్టబద్ధమైన కనీస మద్దతు ధరల కోసం రైతులు ఆందోళనలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. తక్షణమే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు బొమ్మిడి సాయికృష్ణ, సంఘ ఎల్లయ్య, బోనగిరి లింగం తదితరులు పాల్గొన్నారు.