వెలగపూడి | పశ్చిమబెంగాల్ లోని కోల్ కతాలో శర్మిష్టా పనోలి అనే లా విద్యార్ధిని తాజాగా ఆపరేషన్ సింధూర్ పై పోస్టులు పెట్టడం, బాలీవుడ్ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ వీడియోలు చేస్తోంది.
దీంతో మమతా బెనర్జీ సర్కార్ ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపింది. మతం ఆధారంగా శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, మతపరమైన భావాలను రెచ్చగొట్టడానికి ఉద్దేశపూర్వక చర్యలు, శాంతికి విఘాతం కలిగించే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం వంటి సెక్షన్ల కింద ఆమెపై కేసులు నమోదు చేసి రిమాండ్ కు పంపారు.
దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ గా స్పందించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో, షర్మిష్ఠ అనే న్యాయ విద్యార్థిని తన మాటలు కొంతమందికి బాధ కలిగించేలా, విచారకరంగా మాట్లాడిందని, ఆమె తన తప్పును అంగీకరించి, వీడియోను తొలగించి క్షమాపణలు చెప్పిందని పవన్ తెలిపారు.
షర్మిష్ఠపై యూనివర్సిటీ పోలీసులు వేగంగా చర్యలు తీసుకున్నారని, కానీ టీఎంసీ నేతలు సనాతన ధర్మాన్ని అపహాస్యం చేస్తుంటే ఏం చేస్తున్నారని పవన్ ప్రశ్నించారు. టీఎంసీ నేతల వ్యాఖ్యలతో లక్షలాది మందికి కలిగిన బాధ సంగతేంటని పవన్ ప్రశ్నించారు. సనాతన ధర్మాన్ని చెడ్డ ధర్మంగా పిలుస్తున్నప్పుడు ఈ ఆగ్రహావేశాలు ఎక్కడ ఉన్నాయని, వారి క్షమాపణ ఎక్కడని ప్రశ్నించారు.
వారిని కూడా అంతే వేగంగా అరెస్టు చేయరా అని ప్రశ్నించారు. బెంగాల్‌లో బీజేపీ టార్గెట్ గా విభజన రాజకీయాల ద్వారా మత అల్లర్లను రెచ్చగొట్టడానికి మమతా బెనర్జీ సారధ్యంలోని టీఎంసీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆ పార్టీ నేతల వ్యాఖ్యలు హిందూ మత నిజమైన సూత్రాలకు విరుద్ధమన్నారు.