సర్పంచ్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని ఆర్డీవోకు ఫిర్యాదు..

అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం మరిపల్లి గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సత్తు భూపాల్ రావు నామినేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ, అదే గ్రామం నుంచి మరో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన దేశెట్టి రామచంద్రయ్య మంగళవారం అచ్చంపేట ఆర్డీవో కే. మాధవిని కలిసి ఫిర్యాదు చేశారు.
ప్రస్తుతం భూపాల్ రావు ఉప్పునుంతల పీ.ఏ.సీ.ఎస్ చైర్మన్‌గా కొనసాగుతుండగా, ఆ పదవికి రాజీనామా చేయకుండా సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేయడం సముచితం కాదని రామచంద్రయ్య ఆర్డీవోకు వివరించారు.
ఈ సందర్భంగా ఆర్డీవో కే. మాధవి మాట్లాడుతూ, సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లను రిజెక్ట్ చేసే అధికారం తమకు లేదని, రిటర్నింగ్ అధికారులు రిజెక్ట్ చేసిన నామినేషన్లను మాత్రమే వారు అంగీకరించే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు దిలీప్ రావు, నాగటి మల్లయ్య, మద్దెలబండ బాలలక్ష్మయ్య, నాగలి లింగమయ్య, మాగిని దామోదర్, నాగటి కృష్ణ, సంపంగి, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
