Devotional | భ‌ద్రాద్రి రామ‌య్య‌కు వైభ‌వంగా ప‌ట్టాభిషేకం – కనులారా వీక్షించిన భక్త జనం

ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించిన గవర్నర్ జిష్ణు దేవ్ వ‌ర్మ‌
మిథిలా మండ‌పంలో మారుమోగిన‌ రామ‌నామ స్మ‌ర‌ణ
మిన్నంటిన జైశ్రీ‌రామ్‌ నినాదాలు.. పుల‌కించిన భ‌క్త‌జ‌నం
ప్ర‌త్యేక బందోబ‌స్తు ఏర్పాటు చేసిన అధికార యంత్రాంగం
అభినందించిన మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు

భ‌ద్రాచ‌లం, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : భద్రాచలంలోని మిథిలా ప్రాంగణంలో సోమవారం రామచంద్ర స్వామి పట్టాభిషేకం వైభ‌వంగా జ‌రిగింది. తొలుత రామాలయ భద్రుని మండపంలో అర్చక స్వాములు స్వామివారి పాదుకలకు అభిషేకం చేశారు. రాజ లాంఛనాలతో పవిత్ర పావన గౌతమీ నదీ తీరం నుంచి తీర్థములు తీసుకురాగా, భాజా భజంత్రీల సందడి, సన్నాయి మేళాలు, భక్తుల కోలాటంతో సీతారామచంద్ర స్వామి వారికి తిరువీధి కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఆ త‌ర్వాత మిథిలా ప్రాంగణానికి తీసుకు వ‌చ్చారు. శిల్పకళా శోభిత క‌ల్యాణ‌ మండపంపై స్వామి వారిని ప్రతిష్టింప జేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం నిర్వహించారు.

రాజ‌దండం, రాజ‌ముద్రిక అంద‌జేత‌..

రామ‌య్య‌కు పాదుకలు, రాజదండం, రాజముద్రిక, స్వర్ణ కిరీటం, ఖడ్గం, రత్నాభరణం ధరింపజేశారు. శ్రీరామ పట్టాభిషేక పారాయణం గావించారు. రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, ఆదర్వ‌ణ‌ వేదం, విష్ణు పురాణం, భగవత్ శాస్త్రం తదితర పారాయ‌ణం చేశారు. పుష్కర నదీ జలాలతో మహాకుంభ ప్రాంతాన్ని తీర్థ సంప్రోక్షణ చేశారు. పుష్కర నదీ జలాలను తీసుకువచ్చి పవిత్ర స్నానం ఆచరింపజేశారు. 11శ్లోకాలను పటించి స్వామివారికి హారతిచ్చారు. అర్చక స్వాములు భక్తులతో పలు స్తోత్రాలను పఠింపజేశారు. శ్రీరామ నామ స్మరణలతో మిథిలా ప్రాంగణం ప్రతిధ్వనించింది. పట్టాభిషేకం అనంతరం భక్తులపై పుణ్య నదీ జలాలనుజ‌ల్లారు.

ప‌ట్టు వస్త్రాలు స‌మ‌ర్పించిన గ‌వ‌ర్న‌ర్‌

తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శ్రీరామ పట్టాభిషేకం వేడుకకు హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. మహోత్సవాన్ని ఆధ్యాంతం తిలకించారు. తొలుత రామాలయంలో గవర్నర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు డాక్టర్ తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, ఐటీడీఏ పీఓ రాహుల్, రామాలయం ఈవో రమాదేవి తదితరులు పట్టాభిషేకం వేడుకలో పాల్గొన్నారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. వేడుకలు విజయవంతంలో కలెక్టర్, ఎస్పీ, రామాలయం ఈవో కీలక భూమిక పోషించారు. వారిని మంత్రి తుమ్మల ప్రత్యేకంగా అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *