ఆచార్య జయశంకర్‌కు జిల్లా కలెక్టర్ ఘన నివాళి
తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపు
ఉమ్మడి వరంగల్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు.
గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా ఉన్నతాధికారులు ఆచార్య జయశంకర్ జీవితంలోని ముఖ్య ఘట్టాలను స్మరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆచార్య జయశంకర్‌కు తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషలపై మంచి ప్రావీణ్యం ఉందని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే అంకితం చేశారని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన పలు ప్రణాళికలను రూపొందించిన మహనీయుడని పేర్కొంటూ, ఆయన ఆశయాల సాధన కోసం సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సీహెచ్ మహేందర్ జీ, సంపత్ రావు, డీఆర్వో రవికుమార్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కుషిల్ వంశీ, డీపీఆర్వో రఫిక్, కలెక్టరేట్ ఏవో రాజ్‌కుమార్, సూపరింటెండెంట్లు మహేష్‌బాబు, మంజుల, శివకుమార్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
