తుడుకుర్తి పీహెచ్‌సిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు..

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ ; ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకాన్ని పెంపొందించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ నాగర్ కర్నూల్ నియోజకవర్గం పరిధిలో ని తుడుకుర్తి గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రిసెప్షన్ సెంటర్, ఇన్‌పేషెంట్ విభాగం, జనరల్ వార్డులు, ఫార్మసీ, ల్యాబ్ తదితర విభాగాలను పరిశీలించారు.

ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకుని, అటెండెన్స్ రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. ప్రతి రోజు ఎంతమంది రోగులు వస్తున్నారు, స్థానికంగానే ప్రసవాలు జరుగుతున్నాయా అనే విషయాలపై సిబ్బందిని జిల్లా కలెక్టర్ ప్రశ్నించారు, సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, గర్భిణీలకు అందిస్తున్న వైద్య సేవలు, మందుల లభ్యతపై సమీక్ష చేసి, అవసరమైన సూచనలు ఇచ్చారు.

అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉండేలా చూడాలని ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు అంకితభావంతో పని చేయాలని సిబ్బందిని కలెక్టర్ సూచించారు. అనంతరం అదే ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న నూతన ఆసుపత్రి భవనాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పరిశీలించారు.

నిర్మాణ పనుల పురోగతిని సమీక్షిస్తూ, భవనం నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు. ఆసుపత్రి భవనం పనులను వేగవంతం చేసి, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీర్లు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. భవిష్యత్తులో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ఈ ఆసుపత్రి కీలకంగా మారనున్నందున, ఎటువంటి లోపాలు లేకుండా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

Leave a Reply