కలెక్టర్ పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు..

కలెక్టర్ పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు..

అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హెచ్చరిక..

డబ్బులు, ఆర్థిక ప్రయోజనాల పేరుతో మోసాలకు యత్నం
నా పేరుతో వస్తున్న సందేశాలను నమ్మవద్ద
ఎన్టీఆర్ కలెక్టర్ జి. లక్ష్మీశా
వ్యక్తిగత, బ్యాంకు వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దని సూచన
నకిలీ ఖాతాలపై కఠిన చర్యలకు అధికారులకు ఆదేశాలు

విజయవాడ, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశా పేరుతో కొంతమంది మోసగాళ్లు నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను సృష్టించి ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారని జిల్లా పరిపాలన విభాగం హెచ్చరించింది. ఈ నకిలీ ఖాతాల ద్వారా డబ్బు లేదా ఇతర ఆర్థిక ప్రయోజనాలను కోరుతూ సందేశాలు పంపుతున్నట్లు కలెక్టర్ లక్ష్మీ శ వెల్లడించారు. తన పేరుతో లేదా తన ఫొటోలను ఉపయోగించి సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అలాంటి సందేశాలను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని కలెక్టర్ స్పష్టం చేశారు.

అలాగే ఆ ఖాతాలకు స్పందించకుండా, వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, ఓటీపీలు లేదా ఇతర ఆర్థిక సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. సోషల్ మీడియా వేదికలను ఉపయోగించి జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఖాతాలు లేదా సందేశాలు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు లేదా సైబర్ క్రైమ్ విభాగానికి సమాచారం అందించాలని కోరారు.

జిల్లా కలెక్టర్ పేరుతో నడుస్తున్న నకిలీ ఖాతాలపై విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే ఇటువంటి సైబర్ మోసాలను అరికట్టడం సాధ్యమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.