Dravidian politics | జస్టిస్ పార్టీ నుంచి విజయ్ యుగం వరకు

Dravidian politics | జస్టిస్ పార్టీ నుంచి విజయ్ యుగం వరకు
Dravidian politics | డీఎంకే–అన్నాడీఎంకే రాజకీయ వైరానికి చారిత్రక నేపథ్యం
పెరియార్ నుంచి అన్నాదురై వరకు ద్రావిడ ఉద్యమ వికాసం
కరుణానిధి, ఎంజీఆర్, జయలలితల రాజకీయ పోరాటం
2026 ఎన్నికలతో తమిళ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు
Dravidian politics | తమిళనాడు అసెంబ్లీకి జరిగిన 2026 ఎన్నికలు చాలా రకాలుగా ప్రత్యేకంగా మారిపోయి ఎన్నో రకాలుగా విశ్లేషణలు చేయిస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కనబడే తీవ్రమైన రాజకీయ వైరం వంటిది తమిళనాడులో ఒక 40, 50 ఏళ్ల క్రితమే మొదలైంది. అసెంబ్లీలో అన్నా డీఎంకే నాయకురాలు జయలలిత గారి చీరలు లాగడం, అర్ధరాత్రి వయోవృద్ధుడు కరుణానిధిని అరెస్టు చేయడం వంటివి మొత్తం భారతదేశ రాజకీయ చరిత్రలోనే ప్రత్యేకమైన సందర్భాలు.
ప్రతి రాజకీయ పార్టీకి టీవీ ఛానల్ పెట్టుకోవడం అనేది కూడా తమిళనాడు నుంచే మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో మీడియా ఛానళ్లు కొన్ని తమ పార్టీ అనుబంధం గురించి బాహాటంగా చెప్పుకోవడం లేదు కానీ, తమిళనాడులో అటువంటి మొహమాటం మొదటి నుంచి లేనేలేదు. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కన్నా ఒక పుష్కర కాలం వెనకబడింది అని జాగ్రత్తగా గమనిస్తే బోధపడుతుంది.
ఇటువంటి సందర్భంలో విజయ్ తమిళనాడు అధికారం స్వీకరించిన రోజే ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన స్టాలిన్ ఇంటికి వెళ్లడం పెద్ద వార్త అయింది. ఆ సందర్భంగా విడుదల చేసిన ఫోటోలో విజయ్‌ను ఆహ్వానిస్తూ లోపలికి తీసుకువెళుతున్న స్టాలిన్ ఫోటో గమనిస్తే వైరుధ్యం ఏ స్థాయిలో ఉందో బోధపడుతుంది. తెల్ల దోతి అడ్డపంచెతో స్టాలిన్ ఉండగా… సూటు బూటుతో విజయ్ తోడు నడవడం వర్తమాన రాజకీయ చిత్రపటంలో వచ్చిన మార్పును గొప్పగా వివరిస్తుంది.
ఆ రోజు అసెంబ్లీలో 50 ఏళ్ల తర్వాత డీఎంకే, అన్నా డీఎంకే పార్టీల సభ్యులు ఒకే చోట కూర్చోవడం చాలా ప్రత్యేకమైన సందర్భం. అన్నా డీఎంకే పుట్టిన రోజు నుంచే ఆ పార్టీతో డీఎంకే ఉప్పు-నిప్పులాగానే సంబంధాన్ని కొనసాగించింది. ఈ రెండు పార్టీలలో ఎవరు మెరుగు, ఎవరు కాదు అని ఇక్కడ మనం చర్చించడం లేదు. కానీ అంతటి వైరుధ్యం ఉన్న శత్రు శిబిరాలు ఇలా కనిపించడమే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.
ద్రావిడ రాజకీయ పార్టీలుగా పిలవబడే డీఎంకే, అన్నా డీఎంకే మూలాలు 1916లో మొదలైన జస్టిస్ పార్టీ కుదురులో ఉన్నాయి. ఈ పార్టీ సామాజిక సమానత్వం, న్యాయం లక్ష్యాలుగా 1920లోనే మద్రాస్ ప్రెసిడెన్సీలో అధికారంలోకి వచ్చింది. బ్రాహ్మణాధిక్యత మీద కూడా ఈ నాయకులు గట్టిగానే పోరాడారు. దీనిని ‘ద్రావిడ ఉద్యమం‘ ఆరంభంగా పరిగణిస్తారు.

1935లో సంస్కరణవాది రామస్వామి పెరియార్ (1879-1973) జస్టిస్ పార్టీలో చేరడం ఒక మలుపు. మద్రాసు స్టేట్‌లో 1937లో జరిగిన ఎన్నికల్లో జస్టిస్ పార్టీ ఓడిపోయి, కాంగ్రెస్ పార్టీ రాజాజీ నేతృత్వంలో అధికారంలోకి వచ్చింది. రాజాజీ హయాంలోనే హిందీ భాషను పాఠశాల స్థాయిలో కంపల్సరీ సబ్జెక్టుగా చేయడంతో పెరియార్ తన మిత్రులతో కలిసి వ్యతిరేకంగా పోరాడారు.
ఈ నేపథ్యంలో 1944 ఆగస్టులో రామస్వామి పెరియార్ ‘ద్రావిడ కజగం’ (డీకే) ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇది రాజకీయ పార్టీ కాదు గానీ ‘ద్రావిడనాడు’ పేరున ప్రత్యేక దేశం కావాలనే వాదం కూడా మొదలుపెట్టారు. ఎన్నికలలో పాల్గొనకూడదనే నియమాన్ని విభేదించిన పెరియార్ అనుచరులు సి.ఎన్. అన్నాదురై (1909-1969) ద్రావిడ కజగం నుంచి వేరుపడి ద్రావిడ మున్నేట్ర కజగం (డీఎంకే) అనే రాజకీయ పార్టీని 1949 సెప్టెంబర్ 17న ప్రారంభించారు.
నాస్తికత్వం, మూఢనమ్మకాలను వ్యతిరేకించడం, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పోరాడటం మొదలైనవి ఈ పార్టీ ఆదర్శాలు. తమిళం పట్ల అభిమానం, హిందీ పట్ల వ్యతిరేకత, బ్రాహ్మణ వ్యతిరేకత కూడా ప్రధాన లక్షణాలుగా మారాయి. ప్రత్యేక దేశం అనే వాదాన్ని అన్నాదురై పక్కన పెట్టారు. 1950ల్లో కూడా హిందీ వ్యతిరేకోద్యమాలు పెద్ద ఎత్తున నడిచాయి. 1956 జనవరి 28న హిందీ బదులు ఇంగ్లీషును అధికార భాషగా స్వీకరించాలనే ప్రతిపాదన మీద అన్నాదురై, పెరియార్, రాజాజీ… ఈ ముగ్గురు సంతకాలు చేయడం విశేషం. 1957 అక్టోబర్ 13న ‘యాంటీ హిందీ డే’ కూడా పెద్ద ఎత్తున జరిగింది.
ఈ డీఎంకే పార్టీ మొదలైన పదేళ్లకు 1957 ఎన్నికలలో పాల్గొని 15 సీట్లను గెలుచుకుని మద్రాసు అసెంబ్లీలో గుర్తింపు పొందింది. 1962 అసెంబ్లీ ఎన్నికలలో 50 సీట్లు గెలుచుకొని ప్రధాన ప్రతిపక్షమైనా కూడా ఆ పార్టీ వ్యవస్థాపకుడు అన్నాదురై ఓడిపోవడం ఒక విశేషం. 1967 మద్రాస్ రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలలో డీఎంకే పూర్తి మెజారిటీ సాధించి అధికారాన్ని చేపట్టింది. భారతదేశంలో కాంగ్రెస్సేతర రాజకీయ పార్టీ ఇలా మెజారిటీ సంపాదించి అధికారం చేపట్టడం దీనితోనే మొదలైంది. సి.ఎన్. అన్నాదురై ముఖ్యమంత్రయ్యారు.
పొరుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటకలలో త్రిభాషా పథకం అమలులో ఉండగా; మద్రాస్ రాష్ట్రంలో మాత్రం ద్విభాషా పథకాన్ని అన్నాదురై అమలు చేశారు. రాష్ట్రం పేరు ‘తమిళనాడు’గా మార్చిన 20 రోజులు తర్వాత అన్నాదురై 1969లోనే క్యాన్సర్‌తో కన్నుమూశారు. దాంతో 45 ఏళ్ల వయసులో ఎం. కరుణానిధి (1924-2018) తమిళనాడుకు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు.
1967 నుంచి తమిళనాడు రాష్ట్రంలో అధికారం సినిమా రంగపు వ్యక్తుల చేతుల్లోనే ఉంది. అన్నాదురై కేవలం రెండేళ్లు మాత్రమే ముఖ్యమంత్రిగా చేశారు. కానీ అదృష్టవంతుడు కరుణానిధి వేర్వేరు సమయాల్లో మొత్తం ఐదు సార్లు సుమారు 18 సంవత్సరాలకు మించి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు.
అన్నాదురై కాలం చేసిన తర్వాత 1971 అసెంబ్లీ ఎన్నికలలో డీఎంకే విజయానికి ప్రముఖ వ్యక్తి, సినిమా హీరో ఎం.జి. రామచంద్రన్ (1917-1987) కీలకపాత్ర వహించారు. ఎం.జి. రామచంద్రన్ తొలి సినిమాకు స్క్రిప్టు, డైలాగులు అందించిన వ్యక్తి కరుణానిధి. అయినా కూడా విభేదాలు తారస్థాయికి పోయి రామచంద్రన్‌ను డీఎంకే పార్టీ నుంచి కరుణానిధి బహిష్కరించారు.
1972 అక్టోబర్ 17న ఎం.జి. రామచంద్రన్ ఆల్ ఇండియా అన్నా డీఎంకే (ఏడీఎంకే) పార్టీని స్థాపించారు. 1977లో ఎం.జి. రామచంద్రన్ కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకుని అసెంబ్లీతో పాటు పార్లమెంటు ఎన్నికల్లో కూడా విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. కేంద్రంలో జనతా పార్టీ వచ్చినప్పుడు ఆ పార్టీకి అన్‌కండిషనల్ సపోర్ట్ ఇవ్వడం గమనార్హం.
ఎం.జి. రామచంద్రన్ గతించిన తర్వాతనే మళ్లీ కరుణానిధి ముఖ్యమంత్రి పీఠం పొందగలిగారు. కరుణానిధి కన్నా ఎం.జి. రామచంద్రన్ ఏడు సంవత్సరాలు పెద్దవాడు కాగా, జయలలిత (1948-2016) 24 సంవత్సరాల పిన్న. డీఎంకే, అన్నా డీఎంకే చెరోసారి ఎన్నికలలో విజయం సాధిస్తూ ఉండేవి. 2011 తర్వాత అన్నా డీఎంకే రెండు సార్లు విజయం సాధించడం విశేషం.
ఎం.జి. రామచంద్రన్-కరుణానిధి ఈ ద్వయం పోరాటం కన్నా జయలలిత-కరుణానిధి రాజకీయ వైరం ఎక్కువ కాలం వైవిధ్యంగా సాగింది. విజయ్ పార్టీకి సంబంధించిన బలపరీక్ష జరిగిన రోజు డీఎంకే పార్టీ నిరసనగా వాకౌట్ చేయగా; అన్నా డీఎంకే పార్టీలోని 25 మంది విజయ్ టీవీకే పార్టీకి వత్తాసు పలకారు, మరో 22 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు.
తమిళనాడులో విలక్షణమైన ఫలితాలు రాగానే కాంగ్రెస్ పార్టీ బాహాటంగా డీఎంకేతో విడిపోయి విజయ్ వైపు రావడం, అదే సమయంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు తమ అభిప్రాయాన్ని, ఆమోదాన్ని తెలియజేయడానికి కొంత వ్యవధిని తీసుకోవడం గమనార్హం. అంతకుమించి విసికే పార్టీ మరింత జాప్యం చేయడం ఇంకా ఆసక్తిని కలిగించే విషయం.
మధ్యలో ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ చొరవ తీసుకొని మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంటికి వెళ్లి, ఆయన ఓటమి సందర్భంగా సముదాయించడం ఇంకా ఆసక్తి కలిగించే విషయం. తర్వాత సీపీఎం పార్టీ జాతీయ కార్యదర్శి ఎం.ఏ. బేబీ చేసిన ప్రకటన చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది.
పళనిస్వామి నేతృత్వంలో అన్నాడీఎంకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, డీఎంకే మద్దతు ఇస్తుందని, దానికి తమను మద్దతు ఇవ్వమని డీఎంకే కోరిందని బేబీ చెప్పారు. ఈ పోకడ గమనించిన వారికి ఆ రెండు ద్రావిడ పార్టీల గతము, వారి పోరాట విధానము తప్పక గుర్తుకు వస్తాయి… మరిన్ని ఆలోచనలు రేపుతాయి.
డా|| నాగసూరి వేణుగోపాల్
ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు
9440732392
