CID | ఇంటర్నేషనల్ దందా గుట్టురట్టు..

CID | ఇంటర్నేషనల్ దందా గుట్టురట్టు..
- పాన్ ఇండియా లెవెల్ ఆపరేషన్ సక్సెస్
- 15 రోజుల CID ఆపరేషన్
- ఢిల్లీ, గుజరాత్, పంజాబ్ లో 11 మంది అరెస్ట్
- ఆ యాప్‌లను ప్రమోట్ చేస్తే సెలబ్రిటీలైనా ఊరుకోం..
హైదరాబాద్: ఆన్‌లైన్ బెట్టింగ్ మాఫియా గుండెల్లో తెలంగాణ సీఐడీ (CID) రైళ్లు పరిగెత్తిస్తొంది. డిజిటల్ స్క్రీన్‌ల వెనుక కూర్చుని అమాయకుల జేబులు గుల్ల చేస్తున్న అంతర్జాతీయ బెట్టింగ్ నెట్‌వర్క్‌పై సీఐడీ చీఫ్ చారు సిన్హా నేతృత్వంలో ‘పాన్ ఇండియా’ లెవెల్ ఆపరేషన్ సక్సెస్ అయింది.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ (SIT) పర్యవేక్షణలో రంగంలోకి దిగిన సీఐడీ.. కేవలం 15 రోజుల్లోనే దేశంలోని పలు రాష్ట్రాల్లో మెరుపు దాడులు చేసింది.
కేసు వివరాలను మీడియా ముందు పెడుతూ.. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలకు సీఐడీ చీఫ్ చారు సిన్హా లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. “డబ్బుల కోసం యాప్‌లను ప్రమోట్ చేసే వారికి ఒక్క ఇచ్చి కౌన్సిలింగ్ చేశాం. ఈ తప్పు మళ్లీ రిపీట్ అయితే ఎంతటి వారినైనా ఊరుకోం” అని ఆమె మాస్ వార్నింగ్ ఇచ్చారు.

15 రోజుల ఆపరేషన్.. 3 రాష్ట్రాల్లో అరెస్టుల పర్వం!
కరీంనగర్‌లో మూలాలున్న ‘డాఫా బెట్’ (Dafa Bet) గుట్టు తేల్చడానికి 40 మంది సీఐడీ అధికారుల టీమ్ రంగంలోకి దిగింది. నిందితుల వేట కోసం ఢిల్లీ, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలను జల్లెడ పట్టి, ఈ ఇంటర్నేషనల్ దందాను నడిపిస్తున్న 11 మంది కీలక నిర్వాహకులను, వారి అనుచరులను బేడీలు వేసి హైదరాబాద్ తీసుకొచ్చింది.
ఈ ముఠా రోజుకు రూ.8 లక్షల నుండి రూ.10 లక్షల చొప్పున ప్రజల సొమ్మును దోచుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. బ్లాక్ మనీని వైట్ చేయడానికి నిందితులు వాడుతున్న 46 మ్యూల్ బ్యాంక్ అకౌంట్లను సీఐడీ ఫ్రీజ్ చేసింది. ఈ ఒక్క ‘డాఫా బెట్’ యాప్‌పైనే దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో 225 ఫిర్యాదులు, 73 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉండటం దీని తీవ్రతను తెలియజేస్తోంది.


పలు యాప్ లపై కేంద్రానికి లిస్ట్!
తెలంగాణ వ్యాప్తంగా ఆన్‌లైన్ బెట్టింగ్ పై సీఐడీ ఏకంగా 414 కేసులు నమోదు చేసి రికార్డు సృష్టించింది. యువతను బానిసలుగా మారుస్తున్న 108 డేంజరస్ బెట్టింగ్ అప్లికేషన్లను సీఐడీ శాస్త్ర సాంకేతికంగా గుర్తించింది. వాటిని దేశవ్యాప్తంగా శాశ్వతంగా బ్యాన్ చేయాలని కోరుతూ కేంద్ర ఐటీ శాఖకు అధికారికంగా సిఫార్సు లేఖలు పంపింది.
అంతేకాదు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల (ISPs) సాయంతో మరో 37 అప్లికేషన్లకు ‘జియో ఫెన్సింగ్’ (Geofencing) రూట్ మ్యాప్ ఏర్పాటు చేసింది. దీనివల్ల ఆ యాప్స్ తెలంగాణ సరిహద్దుల్లో అసలు ఓపెన్ కాకుండా స్క్రీన్ బ్లాక్ అయిపోతుంది.
సెలబ్రిటీలకు రెడ్ అలర్ట్..
ఈజీ మనీ కోసం బెట్టింగ్, గేమింగ్ యాప్‌ల యాడ్స్‌లో నటిస్తున్న 25 మంది ప్రముఖ సెలబ్రిటీలు, సోషల్ మీడియా స్టార్లను సీఐడీ ఆఫీసుకు పిలిపించి క్లాస్ పీకారు అధికారులు. చట్టవిరుద్ధమైన దందాలను ప్రమోట్ చేయడం కూడా నేరమేనని, సెలబ్రిటీ క్రేజ్ వాడుకుని ప్రజలను మోసం చేస్తే చట్టం ముందు అందరూ సమానులేనని సీఐడీ చీఫ్ తేల్చి చెప్పారు.
