ప్రజా సమస్యల పరిష్కారం కోసం మొదటిసారి ప్రజావాణి ప్రారంభం

ప్రజా సమస్యల పరిష్కారం కోసం మొదటిసారి ప్రజావాణి ప్రారంభం

సుక్కేటి వాగును పునరుద్ధరించాలని ఆర్‌డిఓకు వినతి

​చౌటుప్పల్, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు చౌటుప్పల్ రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రజల నుంచి పలు సమస్యలకు సంబంధించిన అర్జీలను ఆర్డిఓ స్వీకరించారు. అందులో భాగంగా మండల పరిధిలోని సుక్కేటి వాగు (సుక్కేటి కాల్వ)ను ఆక్రమణల నుండి విడిపించి, తక్షణమే పునరుద్ధరించాలని కోరుతూ బిఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు ఉప్పు కృష్ణ సోమవారం చౌటుప్పల్ ఆర్‌డిఓ శేఖర్ రెడ్డి కి వినతిపత్రం సమర్పించారు. ​

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దండుమైలారం, తూప్రాన్ పేట శివారు నుండి దండు మల్కాపురం, కైతాపురం చెరువు, ధర్మోజిగూడెం మీదుగా లక్కారం చెరువు వరకు, అక్కడి నుండి లింగోజిగూడ వరకు సుక్కేటి వాగు విస్తరించి ఉందని తెలిపారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారులు లాభార్జనే ధ్యేయంగా ఈ వాగును వెంచర్ల పేరుతో పూడ్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

లక్కారం – చౌటుప్పల్ మధ్య వాగుపై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ​వాగు పునరుద్ధరణ వల్ల ​కైతాపురం, లక్కారం, చౌటుప్పల్ చెరువులు, కుంటలు నిండి భూగర్భ జలమట్టం పెరుగుతుంది. ​కొన్ని వందల ఎకరాల భూమి సాగులోకి వచ్చి రైతులకు, వ్యవసాయ కూలీలకు మేలు జరుగుతుంది. ​ఈ ప్రాంతంలో సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, అధికారులు స్పందించి సుక్కేటి వాగుపై ఉన్న అక్రమాలను తొలగించి, వాగును పునరుద్ధరించడానికి చొరవ చూపాలని ఆయన కోరారు.