నాడు విద్యార్థి- నేడు ప్రధానోపాధ్యాయులు

  • కార్పోరేటుకు దీటుగా పాఠశాలను తీర్చిదిద్ది
  • తిరుమలగిరి బడి అమ్మ ఒడి
  • రూ. 50 లక్షల దాతల సహకారముతో సకల సౌకర్యాలు
  • వృత్తి నిబద్ధతకు నిలువెత్తు సాక్ష్యం
  • ప్రధానోపాధ్యాయులు దామెర శ్రీనివాస్

తిరుమలగిరి, ఆంధ్రప్రభ : 1987లో తిరుమలగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాడు పదవ తరగతి చదివి 2023లో అదే పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా దామెర శ్రీనివాసులు రావడం ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య నాటి నుంచి బోధిస్తున్నారని తెలుస్తుంది. విద్యనభ్యసించిన పాఠశాలను జిల్లాలో ఉత్తమోత్తమైన పాఠశాలగా తీర్చిదిద్దుతూ ఇటీవల జరిగిన పదవ తరగతి వార్షిక ఫలితాలలో జిల్లా స్థాయిలో ద్వితీయ ర్యాంకు 581 మార్కులు సాధించడమే ఇందుకు తార్కాణం.

రూ. 50 లక్షల దాతల సహకారంతో సౌకర్యాలు..

ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పాఠశాలలో ఉన్న సమస్యలను గుర్తించి దాతల పూర్వ విద్యార్థుల తోడ్పాటు అందరి సహకారముతో సుమారు 50 లక్షలతో పాఠశాలలో సకల సౌకర్యాలు కార్పొరేట్ కు దీటుగా తీర్చిదిద్దారు. తిరుమలగిరి బడి అమ్మ ఒడిగా తయారు చేసినారు. ఉపాధ్యాయులు సమిష్టి కృషి పట్టుదల అంకితభావంతో పనిచేస్తున్నారు. 2024లో 96% 2025లో 100% 2026 లో 100% తో పాటు త్రిబుల్ ఐటీ బాసరలో విద్యార్థులను పంపించి చేర్పించారు.

విద్యార్థులకు ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయిస్తూ..

ప్రతి విద్యార్థికి ఉన్నత లక్ష్యాలు ఏర్పడే విధంగా అవసరమైన గైడెన్స్ ఇస్తూ తల్లిదండ్రులతో మాట్లాడుతూ విద్యార్థుల పురోగతిపై చర్చిస్తూ వారు ఉన్నత స్థాయికి ఎదగడానికి పదును పెడుతూ ఉన్నత లక్ష్యం వైపు అడుగులు వేసే విధంగా తీర్చిదిద్దుతున్నారు.

వేసవిలోనే బడిబాట చేపట్టి..

ఉపాధ్యాయులందరితో టీములుగా ఏర్పడి వేసవి సెలవులను ఉపయోగించుకోకుండా ఇంటింటికి తిరిగి బడిబాటను నిర్వహించి తల్లిదండ్రులతో మాట్లాడి ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందిస్తున్నామని అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నామని తల్లిదండ్రులకు నమ్మకము భరోసా కల్పించడంతో అడ్మిషన్లు వెల్లువలా నమోదు అవుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం ఇప్పటివరకు 130 అడ్మిషన్లు వచ్చినాయి. ఇదే పాఠశాలలో చదివి ఇదే పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా వచ్చి తిరుమలగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పేరు రాష్ట్ర స్థాయికి తీసుకుపోవడం పట్ల ప్రజలు ఆయనకు అభినందనలు తెలుపుతూ, గత సంవత్సరం ఒక్క సెలవు కూడా వాడుకోకుండా పనిచేయడం వృత్తి నిబద్ధతకు నిలువెత్తు సాక్ష్యం ప్రధానోపాధ్యాయులు దామెర శ్రీనివాసు.