Chittoor | ఘనంగా త్రిపురనేని జయంతి..
Chittoor | ఘనంగా త్రిపురనేని జయంతి..
Chittoor, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు జిల్లా సాయుధ దళం కార్యాలయంలో ప్రముఖ సంస్కర్త, కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పోలీసు అధికారి తుషార్ డూడి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ ఆపరేషన్స్, ఇంచార్జ్ అడ్మిన్ రాజశేఖర రాజు కవిరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు సాహిత్యం ద్వారా సమాజంలోని మూఢనమ్మకాల పై పోరాటం చేసి, సామాజిక సమానత్వం, హేతువాదాన్ని ప్రచారం చేసిన మహనీయుడు త్రిపురనేని అని కొనియాడారు. యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజానికి మేలు చేసే దిశగా ముందుకు సాగాలని సూచించారు. త్రిపురనేని రామస్వామి చౌదరి తెలుగు సాహిత్యం, సామాజిక సంస్కరణ ఉద్యమాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన మేధావి అని పేర్కొన్నారు. ఆయనకు కవిరాజు అనే బిరుదుతో పాటు పాండిత్యం కారణంగా అభినవ భారవి అనే పేరును కూడా ప్రజలు గౌరవంగా పిలిచేవారని తెలిపారు. సూతపురాణం, కురుక్షేత్ర సంగ్రామం, శంబుక వధ వంటి రచనలు తెలుగు సాహిత్యంలో నూతన ఆలోచనలు రేకెత్తించి సంచలనం సృష్టించాయని చెప్పారు.
పురాణ పాత్రలను సరికొత్త కోణంలో విశ్లేషించిన తీరు తెలుగు సాహిత్యానికి ప్రత్యేకతను తీసుకొచ్చిందన్నారు. లండన్‌లో బారిస్టర్ విద్యాభ్యాసం చేసినప్పటికీ, న్యాయవాద వృత్తితో మాత్రమే పరిమితం కాకుండా, సమాజ సేవకు, రచనా కృషికి తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తిగా త్రిపురనేని నిలిచారని తెలిపారు. తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప సంస్కర్త, మేధావిగా ఆయనను గుర్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఆర్డీఎస్పీలు చిన్ని కృష్ణ, మహబూబ్ భాష, ఆర్ఐ ఎంటీఓ వీరేష్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
