10 అడుగుల ఎత్తు.. 18 అడుగుల వెడల్పుతో ఢమరుకం

10 అడుగుల ఎత్తు.. 18 అడుగుల వెడల్పుతో ఢమరుకం

విశాఖసిటీ, ఆంధ్రప్రభ: విశాఖ కైలాసగిరిపై నూతనంగా ఏర్పాటు చేసిన త్రిశూలాన్ని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా త్రిశూలానికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీలు శ్రీభరత్, కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలతో కలిసి త్రిశూల్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నదని చెప్పారు. కైలాసగిరిని పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. రూ.3 కోట్ల వ్యయంతో త్రిశూల్ ప్రాజెక్టు నిర్మించామని, 10 అడుగుల ఎత్తు, 18 అడుగుల వెడల్పుతో ఢమరుకం ఉందని, నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వీక్షించేలా ఎత్తయిన కొండపై నిర్మించామని అన్నారు. రాత్రి సమయంలో వెలుగులు విరజిమ్మేలా ఎల్ఈడీ లైట్లు అమర్చడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని చెప్పారు.

మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ విశాఖ నగరాన్ని అత్యున్నత నగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు ఎనలేని కృషి చేస్తున్నారని, వేల కోట్లు పెట్టుబడులు తీసుకువస్తున్నారని పేర్కొన్నారు.కైలాసగిరిని కేవలం పర్యాటక ప్రాంతంగానే కాకుండా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా త్రిశూల్ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకువచ్చామని వీఎంఆర్డీఏ చైర్మన్ ఎంవీ ప్రణవ్ గోపాల్ అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, విశాఖ ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, పంచకర్ల రమేష్‌బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, బండారు సత్యనారాయణ, కొణతాల రామకృష్ణ, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, కార్యదర్శి మురళీకృష్ణ, ప్రధాన ఇంజనీర్ వినయ్‌కుమార్, ప్రజాపిత బ్రహ్మ కుమారీస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం ప్రతినిధులు, అన్నమయ్య ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.

గాజు వంతెనను సందర్శించిన మంత్రి నారాయణ

విశాఖ కైలాసగిరి కొండపై ఇటీవల ప్రారంభించిన గాజు వంతెనను మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ సందర్శించారు. కైలాసగిరిపై త్రిశూలం ప్రారంభించిన తర్వాత వీఎంఆర్డీఏ చైర్మన్ ఎంవీ ప్రణవ్ గోపాల్ గ్లాస్ బ్రిడ్జి గురించి మంత్రికి వివరించారు. దీంతో అత్యంత ప్రజాదరణ పొందిన గ్లాస్ బ్రిడ్జిని ఆయనతో పాటు ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, బండారు సత్యనారాయణమూర్తి, లోకం మాధవి, మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్. తేజ్ భరత్ కలిసి సందర్శించి కొంత సమయం గడిపారు. గ్లాస్ బ్రిడ్జి నగర పర్యాటకులను మరింత ఆకట్టుకుంటుందని మంత్రి నారాయణ పేర్కొన్నారు.