Chittoor | రైల్వే సమస్యలపై ఆందోళన

Chittoor | రైల్వే సమస్యలపై ఆందోళన
- పరిష్కరించాలని నిరసన
- రైల్వే స్టేషన్ మేనేజర్ ముత్తుస్వామికి వినతిపత్రం అందజేత
Chittoor చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : స్థానిక చిత్తూరు రైల్వే స్టేషన్ ఆవరణలో నగర ప్రజలు ఎదుర్కొంటున్న రైల్వే సమస్యలపై శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. చిత్తూరు స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ సొసైటీ (CSCDS) అధ్యక్షులు తాండవ మూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నగరాభివృద్ధికి కీలకమైన రైల్వే సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా పరిశ్రమలు, విద్య, వాణిజ్య రంగాల్లో అభివృద్ధి చెందుతున్నప్పటికీ, రైల్వే మౌలిక వసతుల విషయంలో నిర్లక్ష్యం కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చిత్తూరు నుంచి చెన్నైకి నేరుగా ప్రయాణించే రైలు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అలాగే చిత్తూరులో కనీసం ఆరు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
కాట్పాడి–చిత్తూరు–పాకాల–తిరుపతి మార్గంలో డబుల్ లైన్ పనులను వేగంగా పూర్తి చేసి, వందే భారత్ రైలు సేవలను చిత్తూరుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. నగర రవాణాకు కీలకమైన మహావీర్ వంతెనను కొత్తగా నిర్మించాలని, రైల్వే స్టేషన్‌లో ఎస్కలేటర్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఆర్టీసీ బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి (FOB) నిర్మాణం చేపట్టాలని, బీఎస్ఎన్ఎల్ కార్యాలయం నుంచి రైల్వే స్టేషన్ వరకు సరైన రహదారి నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఈ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని రైల్వే స్టేషన్ మేనేజర్ ముత్తుస్వామికి అందజేసి, వారి ద్వారా రైల్వే ఉన్నతాధికారులకు పంపించారు. చిత్తూరు నగర అభివృద్ధి కోసం రైల్వే సౌకర్యాల మెరుగుదల అత్యవసరమని, ప్రజల ఆకాంక్షలను అధికారులు గౌరవించాలని నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తాండవ మూర్తితో పాటు గోపి నాయక్, సత్య చంద్రబాబు, మురళి, కృష్ణ సింగ్, ఈషా గణేష్ శివకుమరన్ (LGB), జనార్ధన్, నాగరాజు, నాగేంద్ర, పాడి రమేష్, రషీద్, వరద, ఎస్. రమేష్, అశోక్ కుమార్, లీలావతి, హైమావతి, కుసుమ, సుమతి పాల్గొన్నారు. అలాగే రైతు నాయకులు హరిబాబు చౌదరి, వాస్తు హరిబాబు, సంజీవరెడ్డి, చంద్ర మౌళి తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు.
