Chittoor | న్యాయం కోసం రైతు ఆత్మహత్యాయత్నం..!

Chittoor | న్యాయం కోసం రైతు ఆత్మహత్యాయత్నం..!
- కార్యాలయం ఎదుటే కిరోసిన్ పోసుకున్న నాగరాజు
- అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టిన హృదయ విదారక ఘటన
Chittoor | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : న్యాయం కోసం ఏళ్ల తరబడి తిరిగిన ఒక రైతు చివరికి ప్రాణాలపైకి తెచ్చుకున్నాడు. వెదురు కుప్పం మండలం మాంబేడు గ్రామానికి చెందిన నాగరాజు తన భూమి విషయంలో ఎదుర్కొంటున్న అన్యాయంపై స్పందించని అధికార యంత్రాంగం తీరుకు నిరసనగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఈ రోజు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నాగరాజుకు ఎదురు కుప్పం మండలం మాంబేలు గ్రామంలో డీకేటి భూమితో పాటు, 1.05 ఎకరాల సెటిల్మెంట్ భూమి ఉంది.
కొంతకాలం క్రితం వెదురు కుప్పం మండలానికి చెందిన జడ్పీటీసీ సభ్యుడు సుకుమార్ దళిత డీకేటి భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారని నాగరాజు ఆరోపిస్తున్నాడు. అంతేకాదు, తన సెటిల్మెంట్ పొలంలోకి కూడా అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకుంటున్నారని వాపోయాడు. ఈ విషయమై స్థానిక తహసిల్దార్‌కు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. చివరకు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి నేరుగా కలెక్టర్‌కు కూడా వినతిపత్రం ఇచ్చాడు.

అయినా నెలలు గడిచినా తన సమస్యకు పరిష్కారం రాకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యాడు. ఈ రోజు గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తున్న సమయంలో ఆటోలో కిరోసిన్ తీసుకొని కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన నాగరాజును సిబ్బంది లోపలికి అనుమతించలేదు. కొంత సమయం వేచి ఉండాలని చెప్పడంతో ఆవేదనతో కుప్పకూలిపోయిన అతను వెంటనే తన ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమై వెంటనే అతనిపై నీళ్లు పోసి మంటలు చెలరేగకుండా అడ్డుకున్నారు. నాగరాజును అదుపులోకి తీసుకొని రక్షించారు.
ఈ ఘటన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంచలనం రేపింది. ప్రజల సమస్యలు వినడానికి ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్ ముందు ఒక రైతు తన ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ధపడటం అధికారుల తీరుకు అద్దం పడుతోందని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూమి కోసం, హక్కుల కోసం తిరిగిన ఒక రైతుకు న్యాయం అందించడంలో వ్యవస్థ విఫలమైందనే భావన ఈ ఘటన ద్వారా స్పష్టమవుతోంది. సమస్యను పట్టించుకోని అధికారులు చివరకు ఒక మనిషిని ఆత్మహత్య అంచుకు నెట్టారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయం కోరిన రైతుకు కౌంటర్లు, గేట్లు నిర్లక్ష్యమే ఎదురైతే ప్రజాస్వామ్యం ఎటు వెళ్తోంది అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో వినిపిస్తున్నాయి. నాగరాజు ప్రాణాలతో బయటపడినప్పటికీ, అతని ఆవేదన మాత్రం అధికార యంత్రాంగాన్ని కుదిపేస్తోంది.
