“రైస్ పుల్లింగ్” పేరుతో మోసం

“రైస్ పుల్లింగ్” పేరుతో మోసం

నలుగురు అరెస్ట్, ఇద్దరు పరారీ

పెద్దపంజాణి, ఆంధ్రప్రభ: “రైస్ పుల్లింగ్” పేరుతో మోసం చేసి డబ్బులు దోచుకున్న ఘటనలో పంజాని పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా బరుగూరు తాలూకా సూరంకుటై గ్రామానికి చెందిన బి. శేఖర్ (60) అనే వ్యక్తి ఏప్రిల్ 12వ తేదీ రాత్రి పంజాని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆరుగురు వ్యక్తులు “రైస్ పుల్లింగ్” చేస్తామని, తమ వద్ద ప్రత్యేకమైన పాత్ర ఉందని నమ్మబలికి ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్‌గా తీసుకున్నారని, అనంతరం అనుమానం రావడంతో వారు అక్కడి నుంచి పరారైనట్లు పేర్కొన్నాడు.

ఈ ఫిర్యాదు మేరకు పంజాని పోలీస్ స్టేషన్‌లో క్రైం నెంబర్ 40/2026గా కేసు నమోదు చేసి, BNS 318(4), 62 r/w 3(5) సెక్షన్ల కింద విచారణ ప్రారంభించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ పర్యవేక్షణలో, పలమనేరు రూరల్ సీఐ పరశరాముడు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటైంది.

పంజాని ఎస్‌.ఐ మారెప్ప సిబ్బందితో కలిసి సాంకేతిక ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టగా, ఏప్రిల్ 13వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు పంజాని మండలం కొగిలేరు క్రాస్ వద్ద నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు.

అరెస్ట్ అయిన నిందితులు కృష్ణప్ప అలియాస్ గణపతి (కుంభారలపల్లి, వి.కోట మండలం), ఎరుకుల విజయ్ కుమార్ (మేకలచిన్నెపల్లి, చౌడేపల్లి మండలం), కె.ఎం. మునీష్ (కురుగల్ గ్రామం, కొలార్ జిల్లా), షేక్ ఇలియాజ్ (కమ్మేపల్లి, వి.కోట మండలం)గా గుర్తించారు.

ఇక శంకర్ (రాజులూరు, చౌడేపల్లి మండలం), నాగరాజు (గౌనివారిపల్లి, పెద్ద పంజాణి మండలం) పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.

ప్రజలకు హెచ్చరిక…

“రైస్ పుల్లింగ్”, “మ్యాజిక్ కాయిన్స్”, “పవర్ ఉన్న పాత నాణేలు”, “పారంపరిక వస్తువులు డబ్బు తీస్తాయి” వంటి పేర్లతో మోసగాళ్లు ప్రజలను మభ్యపెట్టి డబ్బులు దోచుకుంటున్నారని పోలీసులు హెచ్చరించారు. ఇటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా 112కు సమాచారం అందించాలని సూచించారు.

Leave a Reply