Stock Market | 827 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్
Stock Market | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉత్సాహంగా ముగిశాయి. ఐటీ, ఆర్థిక, రియాల్టీ రంగ షేర్లలో కొనుగోళ్లు జోరందుకోవడంతో ప్రధాన సూచీలు ఒక శాతానికి పైగా లాభపడ్డాయి. జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాల సీజన్ ప్రారంభం కావడం, బ్యాంకుల నుంచి వచ్చిన సానుకూల వ్యాపార అప్‌డేట్లు మార్కెట్‌కు బలాన్నిచ్చాయి.
బీఎస్‌ఈ సెన్సెక్స్ 827.57 పాయింట్లు పెరిగి 77,569.39 వద్ద ముగియగా, ఎన్ఎస్‌ఈ నిఫ్టీ 244.10 పాయింట్లు లాభపడి 24,206.90 వద్ద స్థిరపడింది. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ సూచీ దాదాపు 2 శాతం, రియాల్టీ సూచీ 3 శాతానికి పైగా, పీఎస్‌యూ బ్యాంక్ సూచీ కూడా 3 శాతం వరకు ఎగసింది.
నిఫ్టీ-50లో జియో ఫైనాన్షియల్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, రిలయన్స్, ఎస్‌బీఐ లైఫ్ షేర్లు ప్రధానంగా లాభపడగా.. డాక్టర్ రెడ్డీస్, భారతీ ఎయిర్‌టెల్, నెస్లే ఇండియా, సన్ ఫార్మా, ఎటర్నల్ షేర్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి.
స్థిరమైన ఆదాయ అంచనాలు, ఐటీ రంగంపై ఆశావహ పరిస్థితులు, కృత్రిమ మేధ (ఏఐ) అవకాశాలపై పెరుగుతున్న విశ్వాసం పెట్టుబడిదారుల్లో సానుకూలతను పెంచినట్లు మార్కెట్ నిపుణులు తెలిపారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 75.41 డాలర్లకు, అమెరికా డబ్ల్యూటీఐ క్రూడ్ 71.16 డాలర్లకు తగ్గడం కూడా దేశీయ మార్కెట్లకు ఊతమిచ్చింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (ఎఫ్‌ఐఐ) కొనుగోళ్లు కొనసాగడం మార్కెట్ ర్యాలీకి మరో ప్రధాన కారణంగా విశ్లేషకులు పేర్కొన్నారు.
