జిల్లాలో విజయవంతమైన విద్యాసంస్థల బంద్: ఏఐఎస్ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ
భూపాలపల్లి, ఆంధ్రప్రభ : వామపక్ష విద్యార్థి సంఘాలు ఇచ్చిన రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ పిలుపునకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా విశేష స్పందన లభించిందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సొతుకు ప్రవీణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో బంద్ విజయవంతంగా కొనసాగిందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సొతుకు ప్రవీణ్ కుమార్, నేరెళ్ల జోసెఫ్, కుమ్మరి రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేస్తోందని విమర్శించారు.
రాష్ట్రంలో వేల సంఖ్యలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
స్వయంగా ముఖ్యమంత్రి విద్యాశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ విద్యార్థుల సమస్యలు పరిష్కారం కాకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే విధానాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
రాష్ట్రవ్యాప్త బంద్‌ను విజయవంతం చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలకు ఏఐఎస్ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
