Rs1,600cr | సింగరేణి వ్యవహారాలపై న్యాయ విచారణ జరపాలి…

Rs1,600cr | సింగరేణి వ్యవహారాలపై న్యాయ విచారణ జరపాలి…

Rs1,600cr | హైదరాబాద్, ఆంధ్రప్రభ : సింగరేణి కాలరీస్ సంస్థలో భారీ స్థాయిలో అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సింగరేణిలో జరుగుతున్నట్లు చెబుతున్న అక్రమాలను ప్రశ్నించినందుకే మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపించారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే. తారక రామారావు ఆదేశాల మేరకు చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న మంచిర్యాల జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్‌ను ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, బీఆర్‌ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ తుంగ బాలు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, పార్టీ నాయకులు కురువ విజయ్, అడ్వొకేట్ లక్ష్మణ్ తదితరులు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన దాసోజు శ్రవణ్, బాల్క సుమన్‌పై నమోదు చేసిన కేసులు రాజకీయ కక్షసాధింపు చర్యలేనని ఆరోపించారు.

జైలు నిర్బంధాలు, కఠిన సెక్షన్లు ఉద్యమకారుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో అనేక కేసులు ఎదుర్కొన్న బాల్క సుమన్ ధైర్యంగా ఉన్నారని, ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై కూడా ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ వాటిపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. చట్టం అందరికీ సమానంగా అమలవ్వాలని డిమాండ్ చేశారు.

Rs1,600cr | చంచల్‌గూడ జైలులో బాల్క సుమన్‌ను పరామర్శించిన బీఆర్‌ఎస్ నేతలు

సింగరేణిలో రూ.1,600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని, నైనీ బొగ్గు బ్లాక్ వ్యవహారంలో అవకతవకలు జరిగాయని, ఓబీ వర్క్స్ కాంట్రాక్టులు, డీజిల్ సరఫరా, జిలెటిన్ స్టిక్స్ కొనుగోళ్లలో భారీ అవినీతి చోటుచేసుకుందని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై హైకోర్టు న్యాయమూర్తితో జుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో కారుణ్య నియామకాలు నిలిచిపోయాయని, కార్మికుల సంక్షేమం నిర్లక్ష్యానికి గురవుతోందని కూడా ఆయన విమర్శించారు. కార్మికుల భూములు, హక్కులకు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి అని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. సింగరేణికి సంబంధించిన అన్ని ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపి నిజాలు వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాల్క సుమన్‌కు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని బీఆర్‌ఎస్ నాయకులు ప్రకటించారు.

click here to read more : Nara-Lokesh-Assures : అండగా ఉంటాం Andhra Prabha Top News

click here to read more

Leave a Reply