కన్నుల పండువగా శ్రీ శంకర్ లింగేశ్వర స్వామి రథోత్సవం

కన్నుల పండువగా శ్రీ శంకర్ లింగేశ్వర స్వామి రథోత్సవం
శివ నామ స్మరణతో పులకించిన ఇడ్లూరు, సమస్త పూర్
భారీగా తరలి వచ్చిన ఇరు రాష్ట్రాల భక్తులు
జాతరలో ఎద్దులు కొనుగోలు చేసి వ్యవసాయం చేస్తే..
పంటలు పుష్కలంగా పండుతాయని నమ్మకం
అశేష జనవాహిని మధ్య రథోత్సవ వేడుకలు
ఊట్కూర్, ఆంధ్రప్రభ: హర…హర.. శివ ..శివ .. శంభో శంకర… అంటూ తెలంగాణ కర్ణాటక సరిహద్దుల్లో కుర్మా నది తీరాన వెలసిన శ్రీ శంకర లింగేశ్వర స్వామి రథోత్సవ వేడుకలు నారాయణపేటజిల్లా సమస్తాపూర్, ఇడ్లూరు శివారులో కన్నుల పండువగా కొనసాగాయి. తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల భక్తులు వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన వారు రథోత్సవ వేడుకలకు భారీ ఎత్తున తరలివచ్చి ఉదయం నుండి శ్రీ శంకర్ లింగేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు.

రథోత్సవ వేడుకల్లో భాగంగా భక్తులు శివ నామ స్మరణతో రథోత్సవాన్ని లాగి తమ భక్తిని చాటారు. జాతర వేడుకల్లో భాగంగా నిర్వాకులు అన్ని ఏర్పాట్లు చేశారు. రథోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీ శంకర్ లింగేశ్వర స్వామి ఉత్సవ మూర్తి విగ్రహాన్ని డప్పు మేళ తాళాలతో దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ రథోత్సవం దగ్గరికి వేద మంత్రోచ్ఛారణ మధ్య తీసుకు వచ్చి రథం పై ప్రతిష్టించారు. నిర్వాహకులు ఎంతో ఘనంగా వివిధ రకాల పూలతో రథోత్సవాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

రథోత్సవ వేడుకల్లో భాగంగా ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వామివారికి భక్తులు అభిషేకం మహా మంగళ హారతి రుద్రాభిషేకం తదితర పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం రథోత్సవాన్ని తిలకించేందుకు ఇరు రాష్ట్రాల ప్రజలు వేలాదిగా తరలి వచ్చి రథోత్సవాన్ని తిలకించేందుకు ఎంతో ఆసక్తి చూపి తమ భక్తిని చాటారు. రథోత్సవంలో ఇసుకేస్తే రాలనంత జనం శివనామ స్మరణం జపిస్తూ రథోత్సవాన్ని లాగేందుకు పోటీపడుతూ భక్తి పరవశంతో మునిగితేలారు. జాతర వేడుకల్లో భాగంగా ఆలయ ప్రాంగణం పరిసర ప్రాంతాల్లో వివిధ రకాల దుకాణాలు వెలిశాయి.
శ్రీ శంకర్ లింగేశ్వర స్వామి కొలిచిన వారికి కొంగు బంగారంగా బాసిల్లుతూ ఈ ప్రాంతంలో పర్యాటక క్షేత్రంగా విరాజిల్లుతోంది. ప్రతి దేవాలయములో శివుడు లింగా రూపంలో దర్శనమిస్తాడు. శ్రీ శంకర్ లింగేశ్వర స్వామి దేవాలయంలో మూల విరాట్ శివుడు రూపంలో ఉండటం విశేషం. దేవాలయంలోని శివుడి ఎడమ వైపున ఉన్న నంది విగ్రహం ముక్కులో ఎప్పటికీ నీటి చెమ్మ ఉండటం మరింత ప్రత్యేకత. భక్తులు ప్రదక్షిణలు చేసి నంది విగ్రహం నాసిక రంద్రాలను స్వసించి చూసి వింత అనుభూతిని పొందుతారు.

శ్వేదా రంధ్రాల ద్వారా వచ్చిన నీటి చుక్కలు శరీరంపై చల్లుకుంటే సకల శుభాలు జరుగుతాయని భక్తుల అపార నమ్మకం. రథోత్సవ వేడుకల్లో భాగంగా వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి తమ మొక్కులు చెల్లించుకున్నారు. జాతర వేడుకలు ఉగాది అమావాస్య వరకు పక్షం రోజులపాటు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. జాతరలో ఎద్దులు కొనుగోలు చేసి వ్యవసాయం చేస్తే పంటలు పుష్కలంగా పండుతాయి అని అన్నదాతల్లో ప్రగాఢ నమ్మకం. జాతరలో ఎద్దుల క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతాయి. జాతరలో ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతర వేడుకలు ఉగాది అమావాస్య వరకు ఎంతో ఘనంగా జరుగుతాయి.
