- దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి.
- అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా తెలంగాణ.
- కులగణన సర్వే నిర్వహించిన తొలి రాష్ట్రం తెలంగాణ.
- సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణ అమలు
భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను, గ్యారంటీలను రక్షించుకునేందుకు దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించే ‘ఒకే వ్యక్తి.. ఒకే పార్టీ..’ తరహా విధానాలను ఉమ్మడిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రఖ్యాత మలయాళీ దినపత్రిక మాతృభూమి వారు తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన “మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్” సదస్సు (MBIFL 2025)లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… కేంద్రం మాకు సహకరించడం లేదని ఆగ్రహించారు. ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు కేంద్రం సహకరించడం లేదు.. దక్షిణాది రాష్ట్రాల మీద ఎందుకు వివక్ష అంటూ నిలదీశారు రేవంత్ రెడ్డి. దక్షిణాది రాష్ట్రాలకు ప్రధాని మోడీ ప్రమాదకరం అన్నారు.
“ప్రపంచంలోనే అత్యుత్తమంగా రాష్ట్రాన్ని నిలబెట్టేలా తెలంగాణ రైజింగ్ నినాదంతో సమగ్ర, సమ్మిళిత అభివృద్ధి కార్యాచరణ తీసుకున్నాం. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రణాళికలను ఇప్పటికే అమలు చేస్తున్నాం. అంతర్జాతీయ పెట్టుబడులకు తెలంగాణ కేంద్రంగా మారుతోంది. ఇటీవల దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో రాష్ట్రానికి రూ.1.82 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి.
పారిశ్రామిక రంగం అభివృద్ధితో పాటు అన్ని వర్గాలకు సంక్షేమాన్నీ సమర్ధవంతంగా అమలు చేస్తున్నాం. ముఖ్యంగా రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా, ఎకరాకు రూ.12 వేలు రైతు భరోసా, భూమి లేని కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నాం. పంటలకు కనీస మద్దతు ధరతో పాటు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తున్నాం.
దేశంలోనే రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. 25 లక్షల రైతు కుటుంబాలకు రూ.21 వేల కోట్ల రుణ మాఫీ చేశాం. సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ విధానం. సమగ్ర కుల సర్వే చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణను అమలుకు పూనుకున్న తొలి రాష్ట్రం కూడా తెలంగాణే.
ఈ అంశాలను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఫిబ్రవరి 4వ తేదీని ఏటా ‘తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం’గా జరుపుకుంటాం. జనాభా దామాషా ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు వనరులు సమకూర్చుతాం. సుపరిపాలన ఏడాదిలోనే ఎంత మార్పు తెస్తుందనేందుకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఉదాహారణ.
కేంద్ర ప్రభుత్వ తాజా ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం అతి తక్కువ ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రం తెలంగాణ. తలసరి ఆదాయంలోనూ ప్రథమ స్థానంలో ఉన్నాం. తెలంగాణ ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ అయితే అది భారతదేశ వృద్ధికి ప్రయోజనం కాదా? మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అండగా ఎందుకు ఉండటం లేదు? ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలు, బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకు కేంద్రం ఎందుకు మద్దతుగా నిలవడం లేదు?” అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.