విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేత
దండెపల్లి, ఆంధ్రప్రభ : దండెపల్లి మండలం రెబ్బనపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు.
గత విద్యా సంవత్సరంలో పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను నగదు బహుమతులతో సత్కరించారు. అలాగే 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు కూడా నగదు ప్రోత్సాహక బహుమతులు అందించారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి మంత్రి రాజు మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించడంలో బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకుని విద్యలో మరింత రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ డైరెక్టర్ ఎం.డి. షర్ఫుద్దీన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
